విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టిన వై ఎస్ ఆర్ సి పి మహిళా నేత, సొంతపార్టీ పైన విమర్శలు చేసి లైవ్ లో విషం తాగిన సంఘటన ఈరోజు విజయవాడలో సంచలనం సృష్టించింది. జర్నలిస్టుల సాక్షిగా జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
జోని కుమారి అనే దళిత మహిళ మొదటి నుండి వైఎస్ఆర్సిపి కార్యకర్త గా ఉన్నారు. రాష్ట్ర మాల మహానాడు లో కీలక పదవుల్లో ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన జొని కుమారి సొంత పార్టీపై విమర్శలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడితే పార్టీలోని కొందరు తనను అణగదొక్కాలని చూస్తున్నారు అని చెప్పింది. ఈ విషయాన్ని పార్టీలోని కీలక వ్యక్తుల దృష్టికి తీసుకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పటికీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదని వివరించింది. పోలీసుల దృష్టికి దీనిని తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని తనకు తెలుసని చెప్పుకొచ్చింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఏమిటి దానికి కారకులు ఎవరు అన్నదానిపై పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఇంతలో కెమెరాల సాక్షిగా, జర్నలిస్టుల సాక్షిగా తాను ముందే తెచ్చిపెట్టుకున్న విషాన్ని బయటకు తీసింది. లైవ్ లో నే విషాన్ని తాగుతున్నాను అని, తన దయచేసి ఎవరు డాక్టర్ల వద్దకు, ఆసుపత్రికి తీసుకు వెళ్ళవద్దని తాను అన్నింటికీ తెగించి వచ్చానని చెబుతూనే విషం తాగేసింది.
అప్రమత్తమైన జర్నలిస్టులు అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిపించి వైద్య సహాయం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ సొంత పార్టీపైనే ఇంతగా విమర్శలు చేయడానికి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించడానికి కారణాలు ఏమిటి, కారకులు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.