వైసీపీ హయాంలో బీఏసీ మీటింగ్ జరిగితే అంతా వైసీపీ వాళ్లే ఉన్నా అచ్చెన్నాయుడు వెళ్లేవాళ్లు. స్వయంగా జగన్ వచ్చి తానేదో సెటైర్లు వేస్తున్నాన్నట్లుగా మాట్లాడేవారు. దానికి అచ్చెన్నాయుడు ఇచ్చే కౌంటర్లు పేలిపోయేవి. ఇప్పుడు ఓడలు బండ్లు అయ్యాయి. అసెంబ్లీ బీఏసీ మీటింగ్కు వైసీపీ నేతలు ఎవరూ రాలేదు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కాబట్టి.. ఈగో కారణంగా జగన్ రాలేదనుకుంటే.. ఇతర పార్టీ ఎమ్మెల్యేను పంపాల్సి ఉంటుంది.
ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలకు బీఏసీలో ఒకరికే అవకాశం ఉంటుంది. స్పీకర్ దయతలిస్తే .. విజ్ఞప్తి చేస్తే ఇద్దరికి చాన్సివ్వొచ్చు. కానీ ఒక్క ఎమ్మెల్యేలను కూడా జగన్ పంపలేదు. జగన్ కన్నా సీనియర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను బీఏసీ సమావేశానికి పంపితే.. ఎజెండా విషయంలో వైసీపీ అభిప్రాయాలను కూడా చెప్పి ఉండేవారు. కానీ అలాంటి అవకాశం జగన్ ఇవ్వలేదు.
నిజానికి వైసీపీ తరపున ఒక్క ఎమ్మెల్యే మీడియాలో ఫోకస్ అయినా జగన్ కు నచ్చదు. తనను డామినేట్ చేస్తున్నారని ఆయన అనుకుంటారు. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఆయన ఏ అవకాశం వచ్చినా తాను ఒక్కడే మాట్లాడేవారు. లేదంటే బాయ్ కాట్ చేసేవారు. చివరికి పాదయాత్ర కోసం అసెంబ్లీని బహిష్కరిస్తే.. ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లేందుకు అంగీకరించలేదు. జగన్ మనస్థత్వం అలా ఉంటే.. ఇక వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోకస్ ఎక్కడ వస్తుంది..?