తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వ్యవస్థీకృతంగా జరిగిన దాడుల ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనాత్మకం అవుతోంది. టీడీపీ నేతలు బూతులు మాట్లాడారని అందుకే ప్రజలు సహనం కోల్పోయారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సమర్థింపు కూడా కాస్త విచిత్రంగా ఉందన్న వాదన సహజంగానే ప్రజల్లో చర్చకు వస్తోంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో వ్యక్తిగంతగా బూతులు తిట్టడం అనేది ప్రారంభమయింది వైసీపీ నేతలతోనే. చిన్నా, పెద్దా, మహిళలు అనే తేడా లేకుండా ఇష్టారీతిన బూతులతో విరుచుకుపడేది వైసీపీ నేతలే. ఎవరు మీడియా ముందుకొచ్చిన అదే పరిస్థితి.
వైసీపీ నేతల బూతులని వినీవినీ ప్రజలకు వీళ్లంటే ఇంతే అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్లను ఇతరులు తిడితే.. వాళ్లు తిట్టిన దానితో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదనే అభిప్రాయం సామాన్యులకు కూడా వస్తుంది. తాము అధికారలో ఉన్నాం కాబట్టి ఎన్ని బూతులు తిట్టినా పడాలి ఎదుటి వారు ఒక్క మాట అన్నా కూడా తాము దాడులకు దిగుతామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. ఎవరు తిట్టినా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనను కొడతామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడటం.. వారి రాజకీయానికి పరాకాష్టగా భావింవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు.
ప్రజాస్వామ్యంలో దాడులను ఎవరూ సహించరు. అధికార పార్టీ దాడులు చేసిందంటే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే పాలక పార్టీకి రాష్ట్రంలో అందరి రక్షణ బాధ్యత ఉంటుంది. తమ రక్షణలో ఉన్న వారిపై ఇష్టానుసారంగా తామే దాడులు చేస్తే.. వారికి బాధ్యత లేదనుకుంటారు ప్రజలు. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ .. తమ అధికారం మత్తులో ఉన్న నేతలకు ఇది అర్థం కావడం లేదు. తిట్టారని తాము దాడులు చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే.. ఇంత వరకూ వైసీపీ నేతలు మాట్లాడిన మాటలే అందరికీ గుర్తు చేసినట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.