కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి ఫైర్ బ్రాండ్ రాజకీయాలను వైసీపీ నేతలు ఎదుర్కోలేకపోతున్నారు. ఆమె ఏదైనా సమావేశానికి మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె అసలు సమావేశంలో కాకపోతే బయట మీడియా ముందు మాట్లాడి… వైసీపీకి నోట మాట రాకుండా చేస్తున్నారు. గురువారం కడప జిల్లా డీఆర్సీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జగన్ తీరును తప్పు పట్టారు. ఎందుకు సమావేశానికి రాలేదని ఆమె ప్రశ్నించిన వైనం వైరల్ అయింది. అవినాష్ రెడ్డి కూడా రాలేదు. మాములుగా అవినాష్ రెడ్డి వస్తారు. కానీ ఇప్పుడు డీఆర్సీలో టీడీపీ ప్రాబల్యం ఉంది. అందుకే ఆయన కూడా డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని మాధవీరెడ్డి ప్రశ్నించిన వైనం వైరల్ గా మారింది.
ఒక్క రోజు గడవక ముందే అధికారికంగా మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో ఆమెను ఎదుర్కోవడం కష్టమని భావించి ముందుగానే ప్రోటోకాల్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క కార్పొరేటరే గెలిచారు. తరవాత మాధవీరెడ్డి సమక్షంలో కొంత మంది టీడీపీలో చేరారు. మాములుగా అయితే వైసీపీ కార్పొరేటర్లు ఏకపక్షంగా సభను నిర్వహించుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే హోదాలో మాధవీరెడ్డి కౌన్సిల్ భేటీకి వస్తున్నారని తెలియగానే అందరిలో వణుకు ప్రారంభమయింది. ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు కుర్చీ వేయలేదు. మాట్లాడుతూంటే అడ్డుకున్నారు. దీంతో ఆమె బయటకు వచ్చి వైసీపీ తీరుపై మండిపడ్డారు.
రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సతీమణి అని మాధవీరెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి తనదైన ఫైర్ బ్రాండ్ రాజకీయం చేస్తున్నారు. ప్రతి విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటంతో పాటు రాజకీయం ఎలా చేయాలో అలా చేస్తున్నారు. అంతకు మించి జగన్ ను ఆయన అనుచరగణాన్ని ఏ మాత్రం సంకోచించకుండా విమర్శిస్తారు. తాను గెలిచింది జగన్ రెడ్డిపైనేనని చెబుతారు. రాబోయే రోజుల్లో కడప టీడీపీకి మాధవీరెడ్డినే పిల్లర్ అవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.