అనంతపురం జిల్లా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో డమ్మీలుగా మారిపోయారు. వారికి కనీస పవర్ లేదు. మొత్తం ఇంచార్జ్ హోదాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే అనుభవిస్తున్నారు. ఓ రకంగా సీఎం దగ్గరకు పోయినా పని కాదు… పెద్దిరెడ్డి దగ్గర దేహి అనాల్సిందే. తమ నియోజకవర్గంలో పొలాలకు నీళ్లు రావడంలేదని.. పెద్దిరెడ్డి తరలించుకుపోతున్నాడని శింగనమల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. అటు పాలన పరంగా.. ఇటు పార్టీ పరంగా మొత్తం పెద్దిరెడ్డి గుప్పిట వైసీపీ ఇరుక్కుపోయింది.
ఇప్పుడు టిక్కెట్ల కసరత్తులోనూ పెద్దిరెడ్డిదే పైచేయి. ఆయన ఎవరికి సీటు ఇవ్వాలంటే ఆయనకే ఇస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డే పూర్తి స్థాయిపెత్తనం చెలాయిస్తున్నారు. హిందూపురంలో ఎవరికీ తెలియని దీపికారెడ్డిని తన వ్యాపార పనుల్లో ఉపయోగపడే ఓ వ్యక్తి సిఫారసుతో ఇంచార్జుగా నియమించారు. ఆమె బీసీ మహిళ అని ప్రచారం చేస్తున్నారు. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గం వారు. ఇక శింగనమలలో.. తిరుపతిలో డీఎస్పీగా పని చేస్తున్న శ్రీనివాసమూర్తిని అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఎమ్మెల్యే పద్మావది వీడియో రిలీజ్ చేశారు.
పెద్దిరెడ్డి అనంతపురం జిల్లాపై తన పట్టు నిలుపుకునేందుకు అంతో ఇంతో బలం ఉన్న నేతలందర్నీ.. పూర్తి స్థాయిలో పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్ కు కూడా చెక్ పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అనంతపురంలో అందరూ తన డమ్మీలే గెలవాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. వైసీపీ హైకమాండ్ కూడా మొత్తం ఆయనకే పెత్తనం అప్పగించింది. దీంతో సీనియర్ నేతలు.. పెద్దిరెడ్డిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.