మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెరమీదకు తీసుకొచ్చిన ఆర్ఆర్ చట్టం వైసీపీ నేతల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలను వాడుకొని అవినీతికి పాల్పడిన నేతలపై ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగించాలని ప్రభుత్వానికి యనమల సూచించడంతో వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది.
యమనల వ్యాఖ్యలతో ప్రస్తుతం ఏపీలో ఆర్ఆర్ చట్టంపై బిగ్ డిబేట్ నడుస్తోంది. దేని మీదైనా ష్యూరిటీ ఇచ్చి ఆ పిమ్మట తీసుకున్న ఋణం తీర్చకపోతే నిందితుడికి శిక్ష పడుతుంది. అంతే కాకుండా ఆస్తులను వేలం వేసి ఆదాయాన్ని ఆర్ఆర్ చట్టం ద్వారా తిరిగి రికవరీ చేయవచ్చు. గతంలో అధికారం ఉందని అక్రమార్జనకు పాల్పడిన వైసీపీ నేతలు తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో వారిపై ఆర్ఆర్ చట్టాన్ని ఉపయోగించి తీసుకున్న సొమ్మును కక్కించాలనేది యనమల డిమాండ్.
ప్రస్తుతం ఏపీ అప్పుల్లో ఉంది. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆదాయం కోసం సర్కార్ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ సమయంలో ఆర్ఆర్ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సలహా ఇచ్చారు యనమల. ఈ చట్టం ద్వారా ఆస్తులను జప్తు చేయవచ్చు. వేలం వేయవచ్చు. ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ, అంతకంటే ముందు వారు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను నిగ్గుతేల్చాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ చట్టం వర్తిస్తుంది.
ఈ చట్టం ప్రయోగంతో అవినీతిపరుల ఆట కట్టించడమే కాకుండా , ప్రజా ధనాన్ని రికవరీ చేసినట్లు అవుతుందనేది యనమల వర్షన్. ఈమేరకు ఆర్థిక అంశాలపై మంచి పట్టున్న ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. అసలే ఆదాయ మార్గాల కోసం వెతుకుతున్న ప్రభుత్వానికి యనమల సూచన ఆశాదీపంలా మారింది. దీంతో ఈ చట్టం ప్రభుత్వం తమపై ప్రయోగిస్తుందా అని అవినీతికి పాల్పడిన వైసీపీ నేతల తెగ గాబరా పడుతున్నారు.