వైసీపీకి బీజేపీ బీ టీం కానీ.. అది వైసీపీ అవసరానికే. తేడా వస్తే బీజేపీ నేతలపైనా దాడులు కామనే. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. ఢిల్లీలో బీజేపీ ప్రాపకం కోసం దేనికైనా సిద్ధపడే రీతిలో ఉండే వైసీపీ హైకమాండ్ చర్యలు ఏపీకి వచ్చే సరికి ఎవరినీ వదిలి పెట్టమన్నట్లుగా దాడులకు పాల్పడుతున్నారు. ఇంత కాలం పోలీసుల అండతో టీడీపీ నేతల్ని చిత్రహింసలు పెట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పోలీసుల అండతోనే ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శిపై దాడి చేయడంతో బీజేపీ నేతలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మరో నేత ఆదినారాయణరెడ్డితో కలిసి అమరావతి రైతులకు సంఘిభావం ప్రకటించారు. అక్కడ్నుంచి తుళ్లూరులో ఓ పార్టీ నేతను పరామర్శించి.. విజయవాడ బయలుదేరారు. మందడంలో మూడు రాజధానుల శిబిరం దగ్గరకు రాగానే పోలీసులు కారు ఆపారు. ఎందుకు ఆపారని సత్యకుమార్ అడగక ముందే మాటు వేసిన వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఇతర కార్లలో ఉండి అడ్డుకోబోయిన బీజేపీ కార్యక్రతలను చితకబాదారు. ఒక్క సారిగా అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. దాడులు అయిపోయాక పోలీసులు కార్లను పంపించి వేశారు.
పోలీసుల సాయంతో జరిగిన ఈ దాడులతో సత్యకుమార్, ఆదినారాయణరెడ్డికి మైండ్ బ్లాంక్ అయింది. విజయవాడకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అరాచకాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపినట్లుగా ఆదినారాయణ రెడ్డిని చంపాలని ప్లాన్ చేశారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఈ దాడి పై డీఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కారుపై రాళ్లదాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
స్పష్టంగా వారి దోవన వారు వెళ్తూంటే ఆపించి మరీ దాడికి పాల్పడి.. తీరిగ్గా తమపైనే మొదట దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారంతా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు. అవడానికి బాపట్ల ఎంపీ అయినా.. ఆయన రాజధాని గ్రామాల్లోనే ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటారు. నిజానికి బీజేపీ నేతల జోలికి వెళ్లాంటే సామాన్యంగాఎవరూ దూకుడుగా చేయరు. పై స్థాయి నుంచి సంకేతాలు వస్తేనే చేస్తారు. అది కూడా జాతీయ కార్యదర్శిగా ఉన్న నేతపై దాడి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే బీజేపీ నేతలకు ఇప్పటికైనా అసలు వాస్తవం తెలుస్తుందన్న కామెంట్లు వినిపిస్తోంది.
విచిత్రం ఏమిటంటే దాడి చేయించిన తర్వాత.. జస్టిఫికేషన్గా బ్లూ మీడియాలో… అమరావతి రైతుల సంఘిభావ సభలో జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం ప్రారంభించారు.