ఆంధ్రప్రదేశ్‌లో రౌడీరాజ్యం అంటే ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ నేతలకు అధికార పార్టీ నేతలు చూపించారు. రాష్ట్రం నలుమూలలా టీడీపీ నేతలు, ఆఫీసుల్లో విధ్వంసం సృష్టించారు. ఒక్కరంటే ఒక్క పోలీసు ఎక్కడా అడ్డుకోలేదు. కనీసం సెక్యూరిటీ ఇవ్వలేదు. కొన్నాళ్ల క్రితం వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో హస్తం ఉందని ఫేక్‌న్యూస్ ను ఆధారం చేసుకుని రిలయన్స్ దుకాణాలపై వ్యవస్థీకృతంగా జరిగిన దాడుల్లాగే టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయి. అందరికీ ఒకే సారి దాడులు చేయాలని సమాచారం పంపారని.. అడ్డుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలిచ్చారని భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటిపై యాభై మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్, విలువైన సామాగ్రినంతటిని ధ్వంసం చేశారు. పట్టపగలు అందరూ చూస్తూండగానే నింపాదిగా దాడులు చేసి వెళ్లిపోయారు. గతంలో ఓ రెండు సార్లు పట్టాభిరామ్‌పై దాడి జరిగింది. ఒక్క పట్టాభిరామ్ ఇంటిపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులు జరిగాయి. కొంత మంది సెక్యూరిటీని నెట్టేసి కార్యాలయంలోకి దూసుకెళ్లి దొరికిన వారిని దొరికినట్లుగా కొట్టారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
కడప సహా పలు చోట్ల టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడా పోలీసులు అడ్డుకోవడం కానీ .. భద్రత కల్పించడం కానీ చేయలేదు. గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో వైసీపీ నేతలపై నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేయడంతో నర్సీపట్నం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు అర్థరాత్రి ఇంటికి వెళ్లారు. ఈ అంశంపై ఉదయం మీడియాతో మాట్లాడిన పట్టాభిరామ్ వైసీపీ నేతలు, పోలీసుల వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు చేశారు. దానికి ప్రతిగా దాడులు చేసినట్లుగా భావిస్తున్నారు.
ఈ దాడులపై చంద్రబాబునాయుడు అమిత్ షా, గవర్నర్లకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీనే దాడులకు పాల్పడుతోందని తమ ప్రాణాలకు గ్యారంటీలేదని చెప్పారు. ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.