చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలో ఏపీ రాజకీయ నేతలూ నిండా ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది.కేసినో అంటేనే బ్లాక్ మనీతో వ్యవహారం .. పెద్ద ఎత్తున నగదు ఇక్కడ ఇచ్చి వాటిని కాయిన్లుగా మార్చుకుని విదేశాలకు వెళ్లి క్యాసినోల్లో మార్చుకుని ఆడతారు. ఇలా వందల మంది ఆడారు. ఈ వ్యవహారాలన్నీ చీకోటి ప్రవీణ్‌ను విచారించినప్పుడు ఈడీ సేకరించింది. ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టిన వారిని విచారణకు పిలుస్తోంది.
చీకోటి ప్రవీణ్ కేసినో ఖాతాదారుల్లో తెలంగాణ నుంచే కాదు.. ఏపీ నుంచి కూడా ప్రముఖులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అనంతపురం అర్బన్ నుుంచి గతంలో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేలగా గెలిచారు గుర్నాథ్ రెడ్డి. గుర్నాథ్ రెడ్డితో పాటు యుగంధర్ అనే వ్యక్తి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు . వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లారని.. హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసినో అంటే.. లక్షల్లో ఉండే వ్యవహారం కావడం.. ఎక్కువగా బ్లాక్ మనీతోనే లావాదేవీలు నిర్వహిస్తారు కానీ.. రాజకీయ నేతలు.. వారితో సంబంధాలున్నవారే ఈ కేసుల్లో ఉన్నారు. దీంతో నోటీసులు అందుకున్న వారి పేర్లు బయటకు వచ్చే కొద్దీ సంచలనం అవుతున్నాయి. ముందు ముందు ఏపీకి చెందిన మరికొంత మంది విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి.