సంక్రాంతి అంటే వైసీపీ నేతలకు అసలైన పండుగ కనిపిస్తోంది. కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన కోళ్ల పందేల బరులు కనిపిస్తున్నాయి. పేరుకు అవి కోళ్ల పందేల బరులే కానీ.. అక్కడ అన్నిరకాల జూదాలు జరగబోతున్నాయి. అన్నింటి కంటే హైలెట్‌గా గన్నవరంలో దాదాపుగా కేసినోను ఏర్పాటు చేశారు. దీన్ని చీకోటి ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ నేతలకు ఏపీలో చేయడానికి నిజాయితీగల వ్యాపారాలు లేవు. అన్నీ ప్రభుత్వ తీరు కారణంగా పడకేశాయి. వారు చేయగలిగిన వ్యాపారాలు అక్రమ మద్యం, ఇసుక రవాణా వంటి వ్యాపారాలే. వాటికి తోడు పండగల సమయంలో అదనపు బిజినెస్ అన్నట్లుగా మారిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారు మరింతగా విజృంభిస్తున్నారు. పెద్ద ఎత్తున జూదశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
ఒక్క కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మాత్రమే గట్టిగా ఉంటున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో పోలీసులు లైట్ తీసుకున్నారు కోనసీమ ఎస్పీ మాత్రం కోడి పెందేలను కూడా అంగీకరించడం లేదు. దీంతో పోలీసులు బరులను ఏర్పాటు చేయనివ్వలేదు. తూ.గో జిల్లాకు కూడా ఇంచార్జ్ ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి ఉండటంతో అక్కడా ప్రభావం కనిపిస్తోంది.
నిజానికి కోడిపందేలు పేరుకే కనిపిస్తున్నా వీటికంటే పెద్దఎత్తున గుండాట, ఇతర జూదాల విషయంలోనే నిర్వహకులు ఎక్కువగా లాభపడుతుంటారు. కోట్లలో ఇవి సాగుతుంటాయి.ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మంత్రి విశ్వరూప్ ను కలిసి.. పోలీసులు అడ్డుకున్నా పందేలు జరిపి తీరుతామని ప్రకటించారు. అది వైసీప నేతల వ్యాపారం కాబట్టి చివరికి పోలీసులు సైలెంట్ కాక తప్పదంటున్నారు.