కేటీఆర్ పరువు తీసేసినట్లుగా వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నేతలకు ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. అలా కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్ కాగానే ఇలా జోగి రమేష్ కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు కూడా గట్టిగానే మాట్లాడారు. అయితే ఆ తర్వాత వైసీపీ నేతలు పూర్తిగా చల్లబడిపోయారు. సీనియర్ మంత్రులు తెరపైకి వచ్చి..బతిమాలుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి… అందరి చేత ఔరా అనిపించుకున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
తాను నిన్నటి వరకూ హైదరాబాద్‌లో ఉన్నానని తనకు అసలు కరెంటే లేదని జనరేటర్ మీద ఆధారపడాల్సి వచ్చిందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము ఎవరికైనా చెప్పలేదన్నారు. కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. తాము అభివృద్ది చేస్తే గొప్పగా చెప్పుకోవాలి కానీ పక్క రాష్ట్రం గురించి వ్యాఖ్యలు చేయడం సరి కాదన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడోచ్చా? ఆయన తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని’’ బొత్స డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై హైదరాబాదీలతో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్ర వాసులు కూడా స్పందిస్తున్నారు. అసలు కరెంట్ కోతలే లేవని రిప్లయ్ ఇస్తున్నారు. బొత్స ఎక్కడ ఉన్నారో చెప్పాలంటున్నారు.
మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తెలంగాణలో ఫుల్ కరెంట్ ఉందని ఒప్పుకున్నారు. తెలంగాణలో సింగరేణి గనులలో బొగ్గు పుష్కలంగా ఉండడంతో విద్యుత్ కోతలు లేవని అన్ని రాష్ట్రాలలో అదే పరిస్థితి ఉండదు అన్న విషయాన్ని గమనించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్లు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ పరిస్థితిపై కేటీఆర్ చెప్పింది అక్షర సత్యమని జనసేన పార్టీ ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ నాయకులు విజయవాడ నగరంలో అభివృద్ధి కేటీఆర్ గారికి కాదు తమకు చూపించాలని సవాల్ చేసారు. రంగు మారిన మంచి నీళ్లు 10 రోజుల నుంచి సరఫరా అవుతుంటే చర్యలు తీసుకోలేక పోయారని.. అభివృద్ధి అంటే రాజధానిని నిర్వీర్యం చేయడమా అని ఆ పార్టీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు.