వైసీపీలో నేతలు ఒకరొకరుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం.. కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నోరు విప్పడానికి భయపడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు నేరుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. వీరంతై ఓ లైన్ పాటిస్తున్నారు. అధికారులను నిందిస్తున్నారు కానీ. .. నేరుగా పాలన వైపు తమ విమర్శల్ని పోనీయడం లేదు. రోజు రోజుకూ వీరి సంఖ్య పెరిగిపోతూ ఉండటమే వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఏడాది సంబరాల సమీక్షలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశామో కనిపించకపోయే సరికి చాలా మంది ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఈ అసహనానికి గురవుతున్నారని అంటున్నారు.
వైసీపీ నేతలందరికీ మంట పెట్టిస్తున్న ఇసుక..!
ఆంధ్రప్రదేశ్లో ఇసుక హాట్ టాపిక్ అయింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా ఎక్కువగా ఇసుక లభ్యత ఉండే రాష్ట్రం ఏపీ. తెలంగాణతో పోలిస్తే.. నిర్మాణ రంగం కూడా చాలా తక్కువ. అయితే.. ఏపీలో మాత్రం ఇసుక కొరత. అధిక ధర. తెలంగాణలో మాత్రం. ఇసుక ధర అందుబాటులో ఉంది.. కావాల్సినంత దొరుకుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం అని చెబుతూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఇసుక బ్లాక్మార్కెట్లోకి తరలిపోతూనే ఉంది. ఫలితంగా సామాన్యులకు అందడం లేదు. బిల్డర్లు సంగతి సరే.. సామాన్యులు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక ఉండటం లేదు. ఒకప్పుడు ఐదు వేలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు నలభై వేలు అయింది. అదీ కూడా.. ఇసుక లభ్యత ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లోనే. ఇతర చోట్ల అంత కంటే ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ప్రజాప్రతినిధులపై ప్రజల ఒత్తిడి పెరుగుతోంది. వారికేం చెప్పాలో తెలియక.. ఎమ్మెల్యేలు సతమవుతున్నారు. తమపై ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. అసలు ఇసుక తరలింపులో ఓ పెద్ద తలకాయ కీలకంగా వ్యవహరిస్తోందని.. తెలంగాణలో ఆ “తలకాయ” నిర్వహిస్తున్న బడా ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం తరలించేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి., అయితే.. ఎవరూ నోరు మెదిపే పరిస్థితులు లేవు. ఇసుక కొరత లేదని.. అసహనం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
ఏడాదిలో చిన్న అభివృద్ధి పని చేయలేకపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు..!
ఎమ్మెల్యేపై అనేక రకాల ఒత్తిళ్లు ప్రజల నుంచి.. మద్దతుదారుల నుంచి వస్తూంటాయి. అందులో ప్రధానమైనది అభివృద్ధి పనులు. నియోజకవర్గంలో పనుల కోసం పెద్ద ఎత్తున ప్రజలు వస్తూంటారు. రోడ్ల దగ్గర్నుంచి చెరువుల వరకు అనేక మౌలిక సదుపాయాల పనులు చేస్తూంటారు. గత ప్రభుత్వంలో ఇలాంటివి పెద్ద ఎత్తున జరిగాయి. కానీ గత ఏడాది నుంచి వాటిని నిలిపివేశారు. నేరుగా ఇంజినీరింగ్ పనులన్నింటినీ నిలిపివేస్తూ జీవోలిచ్చారు. దాంతో.. ఇప్పుడు.. ఎక్కడా అభివృద్ధి పనులు కనిపించడం లేదు. ఇలాంటి పనులు జరిగితే.. ప్రజలకు పనులు జరగడమే కాదు.. ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్లు కూడా… సొంత పార్టీ వాళ్లే అవుతారు. దాంతో వారు ఆర్థికంగా బలపడతారు. కానీ సొంత పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. ఎలాంటి పనులు లేవన్న అసంతృప్తి ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.
వైసీపీలో మారుతున్న రాజకీయం కూడా కారణమా..?
సాధారణంగా వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. పార్టీ తరపున ఎవరు ఏం మట్లాడాలన్నా.. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి స్పీచ్ వస్తుంది. దాన్ని చదవాల్సిందే. చాలా కొద్ది మంది నేతలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అయితే.. ఇటీవలి కాలంలో రోజుకో సీనియర్ నేత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇసుక కొరత.. అభివృద్ధి లేకపోవడం.. వంటి విషయాల సంగతి పక్కన పెడితే.. వైసీపీలోని అంతర్గత రాజకీయం కూడా దీనికి కారణం అని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా.. వైసీపీలో అంతర్గతంగా ఓ కీలక మార్పు చేశారని.. పార్టీపై అన్ని రకాలుగా పట్టు పెంచుకున్న నేతను పక్కన పెట్టారని.. ఇతర ప్రముఖుడికి ఆ పదవి ఇచ్చారని చెబుతున్నారు. ఈ అంతర్గత రాజకీయ కారణాలతోనే.. అసంతృప్తి సెగలు బయటకు వస్తున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది.