గత ప్రభుత్వ హయాంలో చివరి రెండేళ్లు వైసీపీ సోషల్ మీడియా విభాగం హద్దులు దాటి మరీ ప్రవర్తించడంపై హోం మంత్రి అనిత వారి ఆట కట్టించే పని ప్రారంభించారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత పోస్టింగ్ లు చేసిన వారిపై యాక్షన్స్ తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతల అరాచకాలపై గట్టిగా పోరాడిన మహిళా నేతలను లక్ష్యంగా చేసుకొని అశ్లీల పదజాలంతో పోస్టులు పెట్టిన వారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ హయాంలో సజ్జల భార్గవ సోషల్ మీడియా వింగ్ ఇంచార్జ్ అయ్యాక పోస్టింగుల స్వరూపమే మారిపోయింది. ప్రత్యర్ధి నేతలను పర్సనల్ అటాక్ చేశారు. మహిళా నేతలని కూడా చూడకుండా పేర్కొన లేనివిధంగా నీచమైన పోస్టులు చేశారు. వీటిపై నాడు పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పైగా..ఇలాంటి వాటిలో హోం మంత్రి అనిత బాధితురాలుగా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా పోస్టింగులపై మహిళా నేతలు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
వీటిపై ఫోకస్ పెట్టిన హోం మంత్రి అనిత.. వాటి లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఎవరి ఆదేశాల మేరకు పోస్టింగులు సృష్టించబడ్డాయి..? అనేది గుర్తించి అనుచిత పోస్టులు చేసిన వారిపై మొదట ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి, ఆ తర్వాత అరెస్ట్ చేయనున్నారు. సజ్జల భార్గవ నేతృత్వంలోనే ఈ అశ్లీల కంటెంట్ పోస్ట్ అయిందని అనుమానాలు ఉన్నాయి.దాంతో త్వరలో ఆయన అరెస్ట్ పక్కాగా తెలుస్తోంది.