వైసీపీ అధికారం కోల్పోయాక గూటికో పక్షిలా మారిన వైసీపీ నేతలు , ఆ పార్టీ మద్దతుదారులు మెల్లగా ఒకే గూటికి చేరుకుంటున్నారు. ఆలస్యం అయినప్పటికీ చేరుకోవాల్సిన చోటుకు చేరుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వల్లభనేని వంశీ, పీఎస్ఆర్ ఆంజనేయులు, రాజ్ కసిరెడ్డిలు విజయవాడ సెంట్రల్ జైల్లో వాలిపోయారు.
వైసీపీ హయాంలో అడ్డమైన వాగుడువాగి , ఏకంగా టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో ప్రస్తుతం రిమాండ్ పొడిగింపుతో విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ. ఇక, ముంబై నటి కాదంబరీ జత్వాని కేసులో అరెస్ట్ అయిన పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు ఇదే జైలుకు తరలించారు. ఆయనకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7814 కేటాయించారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి కూడా ఇదే జైలుకు తరలించారు. ఆయన ఖైదీ నెంబర్ 7813. కసిరెడ్డిని మొదటి బ్యారక్లోని సెల్ నెంబర్ 1లో ఉంచగా, పిఎస్ఆర్ ను రెండో బ్యారక్లోని ఒక సెల్లో ఉంచారు.
వైసీపీ హయాంలో చేసిన అడ్డమైన పనులకు ఒక్కొక్కరుగా శిక్షను అనుభవిస్తున్నారు ఆ పార్టీ నేతలు. బయటకు వచ్చేందుకు వల్లభనేని వంశీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఘన కార్యాలకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఏదో కేసు వల్లభనేని వంశీని విజయవాడ సెంట్రల్ జైల్లోనే ఉంచుతోంది. రాజ్ కసిరెడ్డి కూడా చాలా రోజులే జైల్లో ఉండాల్సి రావచ్చునని, త్వరలోనే వీరికి తోడుగా మరికొంతమంది వైసీపీ నేతలు వస్తారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.