ఏదైనా కొంపలు మునిగే పని జరిగితే కొంప కొల్లేరే అనుకుంటాం.. ఇప్పుడు రిపబ్లిక్ విషయంలో ఏదో చేయాలనుకుంటున్న వైసీపీ నేతల తీరు చూస్తూంటే తెలివి తెల్లేరే అని సినిమా ప్రియులు అనుకోవాల్సిన పరిస్థితి. రిపబ్లిక్ సినిమా రిలీజయిన వారం తర్వాత అందులో కొల్లేరుపై వివాదాస్పద అంశాలున్నాయంటూ వైసీపీకి చెందిన కొంత మంది కొల్లేరు నేతలు.. ముఖ్యంగా ఓ సామాజికవర్గం పేరుతో తెర ముందుకు వచ్చి ఆందోళనలు ప్రారంభించారు. సినిమాను బ్యాన్ చేయాలని.. కొన్ని సీన్లు తీసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
.
రిపబ్లిక్ సినిమా పూర్తిగా కొల్లేరు అంశం చుట్టూనే తిరుగుతుంది.అయితే ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటాయన్న ఉద్దేశంతోనే సినిమా దర్శకుడు దేవా కట్టా ..కొల్లేరు పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. తెల్లేరుగా చెబుతూ కథ నడిపించారు. అందులో చూపించినవన్నీ నిజాలేనని అనుకున్నారేమో కానీ మొదట్లో ఎవరూ స్పందించలేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు వివాదం ప్రారంభించారు. మంచినీటి సరస్సు అయిన కొల్లేరులో అక్వా వల్ల కాలుష్యం పెరుగుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.
సాధారణంగా సినిమాలపై వచ్చే వివాదాలు ఆ సినిమా పబ్లిసిటీకి పనికి వస్తాయి. సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈ వివాదం బయటకు రావడంతో రిపబ్లిక్ సినిమాకు మరింత ప్రచారం లభిస్తుంది. వైసీపీ నేతలు రేపిన వివాదం వల్ల రిపబ్లిక్ సినిమాకు ఎలాంటి నష్టం కలగకపోగా … కొత్తగా పబ్లిసిటీ వచ్చే అవకాశం కనిిస్తోంది. సినిమాలో తెల్లేరు అని ఉంది కాబట్టి కొల్లేరు ప్రస్తావనే లేదు కాబట్టి.. వారి వాదన ఎక్కడా నిలబడే అవకాశమే లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పే మాట.