సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు కాలేదు. స్థానిక నేతలే ప్రసంగించి మ మ అనిపించారు. సభలో రాయలసీమ సమస్యలపై చర్చించిందేమీ లేదు. ఈ ప్రభుత్వంలో కానీ.. రాయలసీమకు జరిగిన మేలేంటో చెప్పుకోలేకపోయారు. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. ప్రసంగించిన వారంతా చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇంకా విచిత్రంగా కొంత మంది దిష్టిబొమ్మల దహనాలను కూడా స్టేడియంలోనే ప్లాన్ చేసుకున్నారు. నారాసుర పేరుతో దిష్టిబొమ్మలు తీసుకొచ్చి . దహనం చేశారు. అన్నింటికీ చంద్రబాబే అడ్డు పడుతున్నారని ఆరోపించారు.
మరో వైపు సజ్జల రామకృష్ణారెడ్డి సభ జరుగుతున్న సమయంలోనే అమరావతిలో మాట్లాడారు. జగన్ ఏం చేయాలనుకున్నా.. చంద్రబాబు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని అనడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. పరిశ్రమలు తరలిపోవడంపై ఆయనేమీ స్పందించలేదు. తమ విధానం మూడు రాజధానులేనని చెప్పుకొచ్చారు. కానీ హైకోర్టు పెట్టాలంటే.. మూడు రాజధానుల బిల్లుతో పని లేదన్న విషయాన్ని మాత్రం ఆయన తెలిసి కూడా తెలియనట్లుగా వ్యవహరించారు. మొత్తంగా రాయలసీమకు జగన్ ఏమీ చేయలేదని.. ఏమి చేయకుండా జగన్ అడ్డుపడ్డారని చెప్పుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు.
మరో వైపు సభను విజయవంతం చేయడానికి సీఎం సభ అంటూ పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయినా సభా ప్రాంగణం నిండలేదు. అత్యధికంగా విద్యార్థులనే తరలించారు. వారు కూడా ఎమ్మెల్యేల ప్రసంగం ప్రారంభమయ్యే సరికి గోడలు దూకి పరారయ్యారు. దీంతో చాలా వరకూ సభా ప్రాంగణం ఖాళీ అయింది. ఆ సీమ.. ఈ సీమ అనే తేడా లేకుండా ప్రజలందర్నీ జగన్ బాదేస్తున్నారు. అయితే రాయలసీమ ప్రజల్లో మాత్రం ఇంకా ఎక్కువ అసంతృప్తి కనిపిస్తోంది. వైసీపీ సభలకు రావడానికి.. రాయలసీమ సెంటిమెంట్ రెచ్చగొట్టాడనికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఏ మాత్రం వర్కవుట్ కావడం లేదు.
అధికార పార్టీగా ఉన్న వైసీపీ.. ఏదైనా చేయాలనుకుంటే.. ముందు సీమ కోసం చేసి చూపించాలి. అలా చేయకుడా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూండటంతో వైసీపీ అధికారంలో ఉందా.. ప్రతిపక్షంలో ఉందా అని ప్రజలు కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితిని వైసీపీ సృష్టించుకుంది.