చెన్నై సమీపంలో మహాబలిపురం వద్ద గల అమరావతి ఆలయానికి చెందిన సదావర్తి సతరానికి సుమారు రూ.1000 కోట్లు విలవ చేసే భూములున్నాయి. వాటిని కొందరు తెదేపా నేతలు, కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజ కలిసి గుట్టు చప్పుడు కాకుండా నామమాత్రపు ధరకే స్వంతం చేసుకొన్నారని వైకాపా ఆరోపించింది. తెదేపా నేతలు సహజంగానే ఆ ఆరోపణలని ఖండించారు. వైకాపా తన ఆరోపణలకి బలం చేకూర్చేందుకు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ఒక నిజ నిర్ధారణ కమిటినీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సభ్యులు నిన్న అమరావతిలో పర్యటించారు. వైకాపా నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అమరావతిలో ప్రజలని రెచ్చగొట్టేందుకే ఆ కార్యక్రమం పెట్టుకొన్నారని ఆరోపిస్తూ తెదేపా కార్యకర్తలు వారికి నిరసనలు తెలియజేశారు. వారిని అడ్డుకొన్నందుకు వైకాపా కార్యకర్తలు కూడా పోటీగా నిరసనలు తెలియజేశారు.
సదావర్తి సత్రం భూములని తెదేపా నేతలు గుట్టు చప్పుడు కాకుండా నామమాత్రపు ధరకే స్వంతం చేసుకొన్నారని వైకాపా ఆరోపించినప్పుడు, ఆ ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో, అది నిజమని నిరూపించవలసిన బాధ్యత వైకాపా కూడా అంతే ఉంటుంది. కానీ రెండు పార్టీలు ఈ వ్యవహారంపై రాజకీయాలు చేస్తున్నట్లు కనబడుతోంది.
అమరావతి ఆలయానికి చెందిన సత్రవ భూముల గురించి వైకాపా నేతలు తెలుసుకోదలిస్తే సమాచార హక్కు ద్వారా దేవాదాయ శాఖ నుంచి అవసరమైన సమాచారం సేకరించవచ్చు. తన వద్ద ఉన్న సమాచారం సరైనదేనని భావిస్తున్నట్లయితే, అవినీతికి పాల్పడినవారిపై కోర్టులో కేసులు వేయవచ్చు. కానీ ఆవిధంగా చేయకుండా నిజ నిర్ధారణ పేరిట వైకాపా నేతలు అమరావతిలో పర్యటించడం తెదేపా ఆరోపిస్తున్నట్లు రాజకీయ ఉద్దేశ్యంతోనే చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఈరోజు సాక్షి పేపరులో “కాగితాల్లోనే ప్లాట్లు” అనే శీర్షికన ఒక కధనం ప్రచురించింది. దానిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులని ప్రభుత్వం దగా చేస్తోందని వ్రాసింది. కనుక వారి పర్యటన వెనుక వేరే ఉద్దేశ్యం ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది.
ఒకవేళ వారు రాజకీయ దురేదేశ్యంతోనే అమరావతిలో పర్యటిస్తున్నా వారిని తెదేపా అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం సబబు కాదు. అంత హడావుడి చేయడం కూడా అనవసరమే. వైకాపా నేతలు ఎవరూ కూడా అమరావతి పరిసర ప్రాంతాలలో తిరగకూడదనుకోవడం తెదేపా ప్రభుత్వ అభాద్రతాభావాన్ని సూచిస్తోంది. వారిని అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం వలన ప్రభుత్వాన్నే అందరూ అనుమానంగా చూస్తారు. రాజధాని ప్రాంతంలో రైతులందరూ స్వచ్చందంగా, సంతోషంగా ప్రభుత్వానికి తమ భూములు అప్పగించారని, దేశ చరిత్రలోనే ఇదొక అరుదైన విషయమని తెదేపా నేతలు గొప్పలు చెప్పుకొంటునప్పుడు, వైకాపా నేతలు అమరావతిలో రైతులని రెచ్చగొడతారని భయపడటం ఎందుకు? ఆ భయంతో వారిని అడ్డుకోవడం ఎందుకు?
ఈవిధంగా రెండు పార్టీలు సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేయకుండా దానిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసుకొంటున్నాయి.