వైసీపీ నేతలు ఇంకా ఓటమి బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఎవరూ మీడియా ముందుకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. కారణం వై నాట్ 175…వై నాట్ కుప్పం అంటూ ఊదరగొట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఏ ఒక్కరూ తమ మొహం చూపించేందుకు ఇష్టపడటం లేదు.
గురువారం మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఒక్కరు మీడియా ముందుకు వచ్చి ప్రజాస్వామ్యంపై లెక్చర్లు ఇచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని టీడీపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాల విష సంస్కృతిని విపరీతంగా ప్రోత్సహించిన వైసీపీ నేతలు… ఇప్పుడు ఆ దాడులు తమ వద్దకు వస్తాయేమోనని ఆందోళనతో ప్రజాస్వామ్యం అనే పల్లవి అందుకున్నారు.
వైసీపీ హయాంలో టీడీపీ నాయకులను టార్గెట్ చేసి మరీ వేధించిన ఘటనలు అనేకం. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచివి కాదని నేతలు చెబుతూ వచ్చినా విచ్చలవిడి తనంతో వ్యవహరించారు. ఆ తరహ వ్యవహారశైలి కారణంగా ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురై…ఇప్పుడు ప్రజాస్వామ్యంపై హితబోధ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఐదేళ్ళుగా ఏమాత్రం గుర్తుకురాని ప్రజాస్వామ్యం అధికార మత్తు దిగగానే గుర్తుకు వచ్చిందా..? అని గుడివాడపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.