ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు పెట్టి మరీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎంపిక చేసింది. వారందరికీ పర్మినెంట్ ఉద్యోగాలు అని చెప్పింది. రెండేళ్ల తర్వాత అందరికీ పర్మినెంట్ చేస్తామని చెప్పింది. తీరా రెండేళ్లు గడువు ముగుస్తున్న సమయంలో ప్రభుత్వం రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. మళ్లీ పరీక్ష రాసి.. పాసయిన వారికే సచివాలయ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ..లేకపోతే లేదని తేల్చి చెబుతోంది. ఈ అంశంపై కొద్ది రోజులుగా సచివాలయ ఉద్యోగుల్లో అలజడి రేగుతూండటంతో.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెర ముందుకు వచ్చారు. పరీక్ష పాసైతేనే ఉద్యోగం ఉంటందని.. లేకపోతే లేదని.. సివిల్ సర్వీస్ సహా అన్ని చోట్లా ఇదే పద్దతి ఉందని చెప్పుకొచ్చారు.
పరీక్ష పాసైతేనే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని చెప్పిన ఆయన.. ఉద్యోగాలు మాత్రం పోవని హామీ ఇచ్చారు. ఇక్కడ రెండు రకాల అర్థాలు వచ్చేలా సజ్జల సచివాలయ ఉద్యోగులకు సందేశం పంపారు. పరీక్ష పాసవ్వకపోతే.. పర్మినెంట్ చేయరు కానీ.. ఇప్పుడు పని చేస్తున్నట్లుగా రూ. పదిహేను వేలకే పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వం పెట్టే డిపార్టుమెంటల్ పరీక్షలు పాసయినవాళ్లకు మాత్రం… ప్రొబేషన్ ఇస్తారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ప్రభుత్వం తాము పర్మినెంట్ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చేశామని చెబుతూ.. వాలంటీర్లతో పాటు.. ఈ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కూడా ఆ జాబితాలో చేర్చి చెబుతోంది. కానీ ఇప్పుడు వారెవరూ పర్మినెంట్ కాదని చెబుతోంది.
ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ ఇలా రెండు అర్థాలతో మాట్లాడుతూ నిరుద్యోగుల్ని.. చివరికి ప్రభుత్వాన్ని నమ్మిన వారిని కూడా నట్టేట ముంచుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్లో పరీక్షలు పెట్టి తీసుకుని.. రెండేళ్లు పనులు చేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ పరీక్షలు పెట్టి పర్మినెంట్ చేస్తామని చెప్పడమే పెద్ద మోసమని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. అయితే… సజ్జల … ఉద్యోగం పోదని హామీ ఇచ్చి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.