తెలంగాణాలో తెదేపా-భాజపా పొత్తులు కధ చాలా ప్రశాంతంగా ముగిసిపోయినట్లే కనిపిస్తోంది కానీ ఆంధ్రాలోనే వాటి పరిస్థితి తెలియడం లేదు. వచ్చే ఎన్నికలలో అవి కలిసి పోటీ చేస్తాయో లేదో, అసలు అంతవరకు అవి కలిసి కొనసాగుతాయో లేదో అని రోజూ అనుమానించవలసి వస్తోంది. అందుకే ఆ రెండు పార్టీలు దేని జాగ్రత్తలో అవి ఉంటున్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధికమంత్రి జైట్లీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పట్టించుకోకపోయినా వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ వంటివారు కొందరు అవకాశం దొరికినప్పుడల్లా తెగ పొగిడేస్తుంటారు. రాష్ట్ర భాజపా నేతలలో కూడా మళ్ళీ అదే పద్ధతి. సోము వీర్రాజు, పురందేశ్వరి వంటివారు ఆయనని విమర్శిస్తుంటే మంత్రి డా.కామినేని శ్రీనివాస్ వెనకేసుకొని వస్తుంటారు.
ఒకవేళ ఏకారణంగానయినా భాజపా విడిపోదలిస్తే, రాష్ట్రంలో దానిని దెబ్బ తీసేందుకు తెదేపా వెనుకాడదని ఖచ్చితంగా చెప్పవచ్చు. భాజపాపై సందించేందుకు ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం వంటి బలమైన అస్త్రశస్త్రాలు తెదేపా వద్ద సిద్దంగా ఉంచుకొంది. ఎన్నికలలో వాటిని భాజపాపై ప్రయోగించవచ్చు.
అలాగే భాజపా వద్ద కూడా ఓటుకి నోటు కేసు, తెదేపా ప్రభుత్వ అవినీతి, నిధుల దుర్వినియోగం, కాల్ మనీ కేసులు, ఇసుక మాఫియా, తెదేపా ఎమ్మెల్యేల ఆగడాలు, తెదేపా హామీల అమలులో వైఫల్యం వంటి అనేక బలమైన ఆయుధాలు ఉన్నాయి. వాటితో అది తెదేపాని దెబ్బ తీయవచ్చు. ఒకవేళ విడిపోతే ఈ విధమైన యుద్ధం అనివార్యం అవుతుందని రెండు పార్టీలకి తెలుసు. బహుశః ఆ భయమే వాటిని ఇంకా కలిపి ఉంచుతోందని భావించవచ్చు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోవడానికి బహుశః ఇది కూడా ఒక కారణం అయ్యుండవచ్చు.
అయితే తమ మధ్య సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకు వారు ఆగ్రహంగా ఉన్నారనే సంగతి ఆ రెండు పార్టీలు గ్రహించాయో లేదో తెలియదు కానీ వాటి వ్యవహార తీరు, లోపాలను సవరించుకోకపోవడం వలన వచ్చే ఎన్నికలలో వైకాపాకి లాభపడితే ఆశ్చర్యం లేదు. తెదేపా ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న అలుపెరుగని పోరాటం ద్వారా నిత్యం అనేక సమస్యలని, అవినీతిని, లోపాలని ప్రజలకి వివరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు గడప గడపకి వైకాపా కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ వెళ్లి తెదేపా వైఫల్యాలు, అవినీతి గురించి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. తెదేపా, భాజపాల స్వీయ తప్పిదాలకి వైకాపా చేస్తున్న ప్రచారం కూడా తోడయితే వచ్చే ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు వస్తాయో ఊహించుకోవచ్చు. కనుక ఇప్పటికైనా తెదేపా, భాజపాలు మేల్కొని తమ గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకొని తదనుగుణంగా వ్యవహరించడం అలవరచుకొంటే వాటికే మంచిది.