వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. సోషల్ మీడియాలో తమకు అనుకూలమైన వాదనల్ని వినిపించడానికి ఇతర పార్టీల నేతల ఉద్దేశాలపై తప్పుడు ప్రచారం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. గతంలో పవన్ కల్యాణ్ అమరావతిని వ్యతిరేకించారంటూ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం కొన్ని వీడియోలు సర్క్యూలేట్ చేయడం ప్రారంభించింది. దీంతో పవన్ కల్యాణ్.. గతంలో తన విధానం ఏమిటో స్పష్టంగా చెప్పారు. పవన్ అమరావతి విషయంలో ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ.. అన్ని ఎకరాలు సేకరించడం అవసరమా అని ప్రశ్నించారు. భూములు ఇవ్వడానికి ఇష్టపడని వారికి మద్దతుగా మాట్లాడారు. ఆ వీడియోలను పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రభుత్వ బాధ్యత గుర్తుచేస్తూ, రైతుల కష్టాలను వివరిస్తూ అప్పట్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. చంద్రబాబును నమ్మి ప్రభుత్వానికి భూములు ఇస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే..రైతుల పరిస్థితి ఏంటని అప్పట్లో పవన్ ప్రశఅనించారు అధికారిక ధ్రువీకరణ పత్రం లేకపోతే రైతులకు నష్టం జరుగుతుందని.. అధికారిక పత్రాలు, శాసనాల ద్వారా జరిగితేనే .. రైతులు ఇబ్బంది పడుకుండా ఉంటారని నాటి ప్రసంగంలో సూచించారు. తాను అమరావతిని గతంలోనూ వ్యతిరేకించలేదనే విషయాన్ని స్పష్టం చేసిన పవన్.. ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. అమరావతిని వ్యతిరేకించానంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తామని మాత్రమే చెప్పానన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెడుతున్నారో ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఒకసారి, మూడుచోట్ల రాజధాని ఉంటుందని మరోసారి చెప్పి గందరగోళాన్ని ఇంకాస్త పొడిగించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ.. ఆరోపణలు చేస్తున్నారు… అధికారం చేతిలో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జనసేన కోరుకుంటున్నది పాలన కేంద్రీకృరణ . అభివృద్ధి వికేంద్రీకరణ అని పవన్ స్పష్టం చేశారు.