మంత్రి ధర్మాన ప్రసాదరావు కావాలని మాట్లాడుతున్నారో .. తాను మేధావినని నిరూపించుకోవాలని మాట్లాడుతున్నారో కానీ ఆయన చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉంటున్నాయి. గతంలో రాజీనామాల వ్యవహారం… నిన్నామొన్నా.. ఒకే రాజధాని అంటూ ప్రకటనలు .. తాజాగా జగన్పై తీవ్ర వ్యత్రికత నిజమేనని అంగీకరించడం ఆ కోవలోకే వస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మాన ..ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత సంస్కరణల కారణంగానేనని చెబుతున్నారు.
సంస్కరణలు అమలు చేసే వారికి ప్రజా వ్యతిరేకత తప్పనిసరి అని ధర్మాన విశ్లేషించారు. అవి మొదట్లో ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని.. సంస్కరణల ఫలితాలు ప్రజలకు అర్థం కావడానికి సమయం పడుతుందన్నారు. ప్రజా వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా జగన్ సంస్కరణలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ధర్మాన మాటలు..హైలెట్ అవుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేదే లేదని అందుకే వై నాట్ 175 అంటున్నారని వైసీపీ నేతలు చెబుతూంటారు. దానికి విరుద్ధంగా ధర్మాన వ్యాఖ్యలు ఉన్నాయి.
ధర్మాన ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలన్నీ.. జగన్ను సమర్థిస్తున్నట్లుగా కనిపిస్తాయి.. కానీ.. ప్రస్తుత పరిస్థితిని ఆయనకు పరోక్షంగా తెలియచెప్పేలా ఉంటున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. పదవి నిలబెట్టుకోవాలంటే.. నేరుగా సలహాలిస్తే కుదరదు. ఎంత సీనియర్ మంత్రులైనా ఓ లైన్ దాటితే.. కట్ చేసేస్తారు. ఈ పరిస్థితిని తట్టుకోలేకనే.. ధర్మాన.. మీడియా ముందు ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
అయితే ధర్మాన వ్యాఖ్యల తర్వాత చాలా మందికి ఒకటే డౌట్ వస్తోంది.. ఇంతకూ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలేంటి అని.. ఎలాంటి చిన్న అభివృద్ధి పని చేయుకండా ప్రజలకు డబ్బులు పంచడమే ఆ సంస్కరణా ? మన వాళ్లు అనుకున్న వారికి.. దోచి పెట్టడమే సంస్కరణలా ? అనేది మాత్రం.. ధర్మాన కూడా చెప్పలేదు. బహుశా.. ఈ విషయంపై మరోసారి మాట్లాడితే తెలుస్తుందేమో ?