ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం వీర లైట్ తీసుకుంది. నచ్చే చెప్పే కమిటీని అని ఒకకమిటీని నియమించారు. కానీ అందులో సగం మంది పట్టించుకోలేదు. సీఎస్, బుగ్గన ఢిల్లీ వెళ్లి ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించి.. మరిన్ని అప్పులకు పర్మిషన్ పొందే పనిలో ఉన్నారు. ఉద్యోగులు మాత్రం అది అసలు అధికారిక కమిటీనే కాదని.. ఓ టైం పాస్ అని తేల్చుకుని అ ప్రకారమే చర్చలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. సమ్మెకు వెళ్తారని తెలిసినా ఎందుకు ప్రభుత్వం ఇంత తేలిగ్గా వ్యవహరిస్తోందన్నదానిపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సమాధానంలాగా మారాయి.
ఉద్యోగులు జీవితాంతం సమ్మె చేయలేరుగా… ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు రావాల్సిందేగా అని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ సమాధానం విన్నవారికి ప్రభుత్వం ఎలాంటి భావనతో ఉందో పక్కాగా అర్థమైపోతుంది. ఉద్యోగులు ఎంత కాలం కావాలంటే అంత కాలం సమ్మె చేసుకుని విసుగు పుట్టి తామే ఉద్యోగాల్లో చేరతామని వస్తారని.. అప్పటి వరకూ తాము పట్టించుకోబోమని చెప్పకనే చెబుతున్నారు. మరి ఉద్యోగులు లేకపోతే.. ప్రభుత్వం నడవదు. అదే జరిగితే ఎవరికి నష్టం.
తమకేమీ నష్టం లేదని.. ప్రజలకే నష్టమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. వారికే సేవలు ఆగిపోతాయి కానీ తమకేమీ సంబందంలేదనుకుంటున్నారు. కానీ ఉద్యోగుల సమ్మె వల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ ప్రభుత్వం తాత్కాలిక ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది కాబట్టి ..వాటి గురించి ఆలోచించడం లేదు. ఉద్యోగులే గతి లేక మళ్లీ వచ్చి చేరుతారని భావిస్తోంది. దీంతో ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరి ఈ ప్రభుత్వ వ్యూహంపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి..!