పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదలయింది. సినిమా అనేది వ్యాపారం. లాభనష్టాలు చూసుకుంటారు. డిమాండ్‌కు తగ్గట్లుగా రేటు కూడా ఉంటుంది. ఇది అన్ని వ్యాపారాల్లో ఉండేదే. అలాగే సినిమాల్లోనూ ఈ ట్రెండ్ వచ్చింది. దానికి తగ్గట్లుగా వారు ఇటీవలి కాలంలో ప్రభుత్వాల అనుమతితోనే రేట్లు పెంచుకుంటున్నారు. కానీ వకీల్ సాబ్ దగ్గరకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. ప్రజలందరికీ టిక్కెట్ రేట్లు అందుబాటులో ఉంచుతున్నామంటూ జీవో తీసుకు వచ్చేశారు. పవన్ కల్యాణ్‌పై రాజకీయంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసే.. పేర్ని నాని లాంటి మంత్రులు మీడియా ముందుకు వచ్చేసి.. రేట్లు పెంచేసి దోచుకుంటున్నారని ప్రజలు పిచ్చోళ్లా అనే డైలాగ్ కూడా కొట్టేశారు. ఎంత గడుసుదనం లేకపోతే మంత్రి పేర్ని నాని ఈ డైలాగ్ వాడగలరు…?
వకీల్ సాబ్ టిక్కెట్ రేట్లు పెంచితే ఎవరికి నష్టం..!
వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ రూ. వెయ్యికి అమ్మితే ఎవరికి నష్టం..?. మహా అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కొనుక్కుంటారు. సామాన్యజనం ఎవరూ అంత రేటు పెట్టి టిక్కెట్ కొనుగోలు చేసి … ధియేటర్లకు వెళ్లి సినిమాలు చూడరు. ఒక వేళ ఆ రేటుకు అధికారికంగా అమ్మకపోయినా ధియేటర్ యాజమాన్యాలు బ్లాక్‌లో అమ్మేస్తాయి. బ యట అయినా సినిమా చూడాలని అనుకునేవారు … అదే రేటు పెట్టి కొనుగోలు చేసి చూస్తారు. అది అభిమానం. దానికి దోపిడీలు.. దోచుకోవడాల్లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడితే… పేర్ని నాని కూడా ఆ జాబితాలోకి వస్తారు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డికి .. వైఎస్ ఫ్యామిలీకి తాను గొప్ప అభిమానని చెప్పుకుంటారు. ఆయన కోసం దిగజారి మాట్లాడి.. తమ ఇమేజ్ చెడగొట్టుకుంటున్నారు. అది వెయ్యి రూపాయలతో వచ్చేది కానీ పోయేది కానీ కాదు. జీవితాంతం ఆ చెడ్డ పేరు ఉంటుంది. జగన్ పై.. వైఎస్‌పై అభిమానం కోసం తన పేరునే చెడగొట్టుకుంటున్న పేర్ని నానికి పవన్ ఫ్యాన్స్ వెయ్యి రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కోవడం దోచుకోవడంలాగా ఎందుకు అనిపించిందో..? బహుశా.. ఆయన అభిమానం కళ్లకు గంతలు కట్టేసి ఉండవచ్చు…?
నిజంగా ఏపీలో దోపిడీకి గురవుతుంది ఎవరు…?
ఏపీలో నిజంగా దోపిడికి గురవుతుంది ఎవరు. ఒక్క సారి తలపైకెత్తి చూస్తే… రెండేళ్లలో వచ్చిన మార్పులు చూసి ప్రజలుగుండెలు బాదుకుంటారు. రూ. వంద చేయని చీప్ లిక్కర్‌ను రూ. 3 వేలకు అమ్ముతోంది ఎవరు..? రూ. రెండు వేలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక రూ. 10వేలకు అమ్ముతోంది ఎవరు..? ప్రతీ లీటర్ పెట్రోల్‌పై ఉన్న టాక్స్‌లు కాక రూ. నాలుగు ఎక్కువ వసూలు చేస్తోంది ఎవరు..? ఆరు నెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు రెట్టింపు అయ్యాయి..? రెండేళ్లలో ప్రతీ అంశంలోనూ పన్నులు పెంచి ప్రజల్ని దోచుకుంటోంది ఎవరు..?. ఇలా లెక్కలు చూస్తే… ప్రజల్ని నిట్ట నిలువుగా.. అడ్డంగా… దోపిడి చేస్తున్నది ప్రభుత్వమే. ప్రజలకు పనులు లేకుండా చేసి.., పథకాల పేరుతో చిల్లర విసిరేసి వారిని నాశనం చేస్తున్నది ప్రభుత్వమే. ఆత్మపరిశీలన చేసుకుంటే పేర్ని నానికి అర్థమవుతుంది.
రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తారా..?
రాజకీయం రాజకీయమే. అది వ్యక్తిగతం కాకూడదు. దురదృష్టవత్తూ మరుగుజ్జు ఆలోచనలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడంతో రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా ఊహించుకుని వారిని శారరీకంగా.. మానసికంగా.., ఆర్థికంగా హింసించడానికి ఏ మాత్రం వెనుకాడని దౌర్భగ్య స్థితి ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తోంది. రేపు అధికారం మారితే వచ్చే ప్రభుత్వమూ అంతే చేస్తుంది. అలా చేయకపోతే వారిని చేతకాని వారంటారు. ఈ పరంపరం అలా కొనసాగుతుంది. అధికారంలోకి వచ్చే వారు అందుకే బాధ్యతగా ఉండాలి. లేకపోతే.. ఆది వ్యవస్థ గమనంపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. దరిద్రపువశాత్తూ.. ఏపీకి ప్రస్తుతం ఈ దుర్గతి పట్టింది.