నడిచేది తాను కాకపోతే ఢిల్లీ కూడా దగ్గరేనని చెబుతారని ఓ నానుడి ఉంది. అది వైసీపీ విషయంలో నిజం కాబోతోంది. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖకు దగ్గరయ్యే కొద్దీ . ఎలాగైనా వారి పాదయాత్రను ఆపాలని ప్రయత్నిస్తున్న వైసీపీ పెద్దలు.. ఉత్తరాంధ్ర నేతలనే కష్టపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే గర్జనలు.. జేఏసీ భేటీల పేరుతో వారికి తీరిక లేకుండా చేశారు. ఉత్తరాంధ్రలో ఇప్పుడు నేతలెవరూ గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. జన స్పందన లేకపోయినా మీడియాలో కనిపించడానికయినా.. మూడు రాజధానులకు మద్దతు కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే ఇదేమీ పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదని.. సజ్జల అండ్ కో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామాల వ్యూహం అమలు చేద్దామనుకున్నా… ఒక్క చోట చేస్తే సరిపోదని అన్ని చోట్లా చేయాలన్న డిమాండ్ వస్తుంది. ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఇలా చేద్దామని.. ఆ లోపు వేడిని పెంచాలని భావిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నవన్నీ వర్కవుట్ కావడం లేదు కాబట్టి… మంత్రులతో పాదయాత్ర చేయిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఈ పాదయాత్రలో ఉత్తరాంధ్ర మంత్రులే కాకుండా కోస్తా, సీమ మంత్రులు కూడా పాల్గొనేలా చూడనున్నారు.
అమరావతి రైతులకు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం కత్తి కట్టింది. వారి పాదయాత్ర సాగితే.. . తమకు ఏదో మునిగిపోతుందన్న అభిప్రాయానికి వస్తోంది. అందుకే హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే పోలీసులు పాదయాత్రపై దాడికి దిగారు. విశాఖ చేరుకునేసరికి.. ఇంకా తీవ్రమైన వేధింపులు, దాడులు ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీ అనుబంధ సంస్థలాగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా రైతులపై దాడులకు అవకాశం కల్పిస్తున్నారు. రాజమండ్రిలో ఏం జరిగిందో వీడియోలతో సహా సాక్ష్యంగా వెలుగులోకి వచ్చాయి.
రైతుల్ని భయ పెట్టి అయినా సరే వెనక్కి పంపాలని ప్రభుత్వం, వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో ముందు ముందు వైసీపీ వ్యూహం మరింత హింసాత్మకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.