ఇప్పటి వరకు మొత్తం 19 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి దూకేశారు. త్వరలో మరో ఎమ్మెల్యే గోడ దూకేసేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి స్వంత జిల్లా చిత్తూరులో పలమనేరుకి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి తెదేపాలో చేరడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతిలో మహానాడు జరుగుతున్న సమయంలోనే అమర్నాథ్ రెడ్డిని తెదేపాలో చేరవలసిందిగా జిల్లాకి చెందిన కొందరు సీనియర్ తెదేపా నేతలు కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ అదే జరిగితే, చిత్తూరు జిల్లా నుంచి తెదేపాలో చేరుతున్న మొట్టమొదటి వైకాపా నేత ఆయనే అవుతారు. భూమానాగి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి తెదేపాలోకి వెళ్ళిపోయిన తరువాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించిన వారిలో అమర్నాథ్ రెడ్డి కూడా ఒకరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పదవిని మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కట్టబెట్టడంతో అమర్నాథ్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచే ఆయనకి అసంతృప్తి మొదలయిందని తెలుస్తోంది. బహుశః అందుకే ఆయన వైకాపాకి గుడ్ బై చేపేసి తెదేపాలో చేరాలనుకొంటున్నారేమో?
ఇటీవల తెదేపాలో చేరిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అమర్నాథ్ రెడ్డి తెదేపాలో చేరబోతున్నారంటూ ప్రకటించడం విశేషం. ఒకవేళ అమర్నాథ్ రెడ్డి తెదేపాలోకి వచ్చేస్తే, జిల్లాలో వైకాపా కంచుకోటకి పగుళ్ళు ఏర్పడినట్లే భావించవచ్చు. క్రమంగా జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తెదేపాలోకి తరలి రావచ్చు.