వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న రకరకాల వ్యూహాల కారణంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల వలసలు తగ్గించగలిగారు కానీ పూర్తిగా ఆపలేకపోతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి గురువారం సాయంత్రం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. ఆయన మొదటి నుంచి తెదేపాలోనే ఉన్నప్పటికీ, 2013లో తెదేపాని వీడి వైకాపాలో చేరి 2014 ఎన్నికలలో పలమనేరు నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ వైకాపాలో ఆశించినట్లుగా తగిన గుర్తింపు పొందకపోవడంతో మళ్ళీ తెదేపాలోకి వచ్చేస్తున్నట్లు చెప్పారు. ఆయన తెదేపాలోకి తిరిగి వచ్చేయడంతో చిత్తూరు జిల్లాలో తెదేపా, వైకాపాల బలాబలాలు సమానం అవుతాయి. రెండు పార్టీలకి చెరో 7మంది ఎమ్మెల్యేలు ఉంటారు. జిల్లా రాజకీయాలపై మంచి పట్టున్న అమరనాథ రెడ్డి చేరికతో ఆ జిల్లా నుంచి మరి కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి మారే అవకాశం ఉంది. కనుక వైకాపా అప్రమత్తం అవవలసిన అవసరం ఉంది.
నిజానికి చంద్రబాబు నాయుడి స్వంత జిల్లాలోనే వైకాపా అన్ని ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకోవడం ఆయనకి, తెదేపాకి హెచ్చరిక వంటిదే. తెదేపా పట్ల జిల్లా ప్రజలలో అసంతృప్తి నెలకొని ఉందని చెప్పడానికి అది ప్రత్యక్ష ఉదాహరణ. కనుక వారి అసంతృప్తికి కారణాలు కనుగొని దానిని తీర్చే ప్రయత్నం తెదేపా ప్రభుత్వం చేసి ఉంటే 2019 ఎన్నికలలో దాని సానుకూల ఫలితం కనబడి ఉండేది. కానీ ఆవిధంగా చేయకుండా వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి రప్పించడం ద్వారా జిల్లాలో తను కోల్పోయిన బలాన్ని మళ్ళీ పొందాలని తెదేపా ప్రయత్నిస్తోంది. దానితో జిల్లాలో తెదేపా బలపడినట్లు పైకి కనబడుతున్నా, జిల్లా ప్రజలలో అసంతృప్తి నెలకొనే ఉంటుంది కనుక వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఎదురుదెబ్బ తినే ప్రమాదం ఉంది. కనుక జిల్లా నేతలను మచ్చిక చేసుకొని పార్టీని బలపరుచుకొనే బదులు, జిల్లా ప్రజలలో 80 శాతం సంతృప్త స్థాయి పొందడానికి ఏమి చేయాలో ఆలోచిస్తే మంచిది. లేకుంటే 2019 ఎన్నికలలో చరిత్ర పునరావృతం కావచ్చు.