వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్యేలు రెండు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1 తెదేపా నేతలు, వారి పద్దతులతో ఇమడలేకపోవడం. 2 తమపై వైకాపా చేస్తున్న విమర్శలు, ఆరోపణలకి సమాధానం చెప్పలేకపోవడం. వారిని ఏదోవిధంగా తెదేపాలో చేర్చుకొనే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఆ తరువాత వారి ఘోడు పట్టించుకోవడంలేదనే పిర్యాదులు వినిపిస్తున్నాయి. తెదేపా నేతలకి, వారికీ మధ్య చిన్న ఘర్షణలు జరుగుతున్నప్పటికీ అందరూ సర్దుకుపోవాలని చెపుతున్నారే తప్ప వారి మధ్య విభేధాలని తొలగించేందుకు సమయం కేటాయించలేకపోతున్నారని ఆరోపణ వినిపిస్తోంది.
తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలకి, వైకాపాకి అప్పుడప్పుడు ప్రత్యక్షంగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వారు నేటికీ తమ పదవులకి రాజీనామాలు చేయకుండా వైకాపా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నందున, సహజంగానే వారిపై వైకాపా అక్కసు వెళ్లగక్కుతూ తీవ్ర విమర్శలు, డబ్బుకు అమ్ముడుపోయారంటూ ఆరోపణలు చేస్తోంది. దమ్ముంటే రాజీనామాలు చేసి తమని ఎదుర్కొని చూపాలని సవాలు విసురుతోంది. వారిపై అనర్హత వేటు వేయాలని న్యాయపోరాటం కూడా చేసింది.
దానితో సహనం కోల్పోయిన భూమా నాగిరెడ్డివంటివారు వైకాపాకి గట్టిగా బదులు చెప్పడమే కాకుండా, జగన్ వ్యవహార శైలి, అక్రమాస్తుల గురించి కూడా ప్రస్తావించి వైకాపా తమ జోలికి రాకుండా చేసుకోగలిగారు. కానీ వైకాపా మాత్రం మిగిలినవారి వెంటపడుతూనే ఉంది. అందుకే ఈసారి పాడేరు వైకాపా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు ఘాటుగా ప్రతివిమర్శలు చేశారు.
ఆయన నిన్న వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ, “నేను రెండేళ్ళు వైకాపాలో ఉన్నాను. అప్పుడు వైకాపాకి నాలో ఎటువంటి లోపమూ కనబడలేదు. కానీ పార్టీ విడిచిపెట్టగానే అక్రమ మైనింగ్ చేసే అవినీతిపరుడిగా, ప్రజాధనం దోచుకొనే దొంగగా, గంజాయి వ్యాపారం చేసే వ్యాపారిగా సాక్షి మీడియా ద్వారా నాపై బురద జల్లుతున్నారు. నేను జగన్ లాగ తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించుకోలేదు. గంగిరెడ్డి వంటి ఎర్రచందనం స్మగ్లర్లతో నాకు సంబంధాలు లేవు. జగన్ లాగ హైదరాబాద్, బెంగళూరు, ఇడుపులపాయలో వందలాది ఎకరాలలో రాజభవనాలని తలపించే ఇళ్ళు కట్టుకోలేదు. పాడేరులో చిన్న ఇల్లు కట్టుకొన్నాను అంతే. నేనేమి రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని కాలేదు. నాకున్న చిన్న కంకర క్వారీ ద్వారానే సంపాదించుకొన్నాను తప్ప జగన్ లాగ అడ్డదారులు త్రొక్కలేదు. ఈడి వందల కోట్లు ఆస్తులు జప్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. నాపై ఇంకా బురద జల్లే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డిని, సాక్షి మీడియాని కూడా కోర్టుకీడుస్తాను,” అని గట్టిగా హెచ్చరించారు.
తమపై సాక్షి ద్వారా వైకాపా బురద జల్లుతోందని ఆరోపిస్తూ సర్వేశ్వర రావు వంటివారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సహజమే. తెదేపాలో చేరిన వైకాపా నేతలు జగన్ అవినీతిపరుడని, తాము మాత్రం చాలా నీతిమంతులమని చెప్పుకొంటున్నారు. మరి అటువంటప్పుడు జగన్ వద్ద అన్నేళ్ళు ఎందుకు పనిచేశారు? అలాగే తెదేపాలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేలు అవినీతిపరులన్నట్లు వైకాపా ఆరోపిస్తోంది. అంటే వైకాపాలో మిగిలిన అందరూ కూడా అవినీతిపరులనే దాని ఉద్దేశ్యమా? తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలపై సాక్షి మీడియా చేస్తున్న ఆరోపణలు, అలాగే వారు జగన్ పై చేస్తున్న ఆరోపణలని కలిపి చూస్తే అందరూ ఒక తానులో ముక్కలేనని అర్ధం అవుతుంది. నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా వారు ఒకరిపై మరొకరు చేసుకొంటున్న ఆరోపణలే వారి గురించి వివరిస్తున్నాయి. కాకపోతే ఇంతకాలం వారందరూ ఒకే గొడుగు క్రింద ఉన్నందున సర్దుకుపోవలసి వచ్చింది. ఇప్పుడు బయటకి రావడంతో వారి కధలు వారి నోటితోనే చెప్పుకొంటున్నారు. వాటిని విని ఆనందించడమే ప్రజల పని.