మరో వికెట్ పడిపోయినట్టే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే తెలుగుదేశం లో చేరిపోతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ బుధవారం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన తెలుగుదేశంలో చేరిక కూడా ఖరారు కాబోతున్నది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలో చేరిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 8 కి చేరుకుంటుంది.
రెండు రోజుల కిందట పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ నిర్వహించిన సమావేశానికి కూడా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ డుమ్మా కొట్టారు. ఆ గైర్హాజరీని పురస్కరించుకుని ఆయన కూడా తెదేపా వైపు చూస్తున్నట్లు మీడియాలో పుకార్లు వచ్చేసరికి కొందరు వైకాపా నాయకులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి రెండు రోజుల్లోనే ఆ సంగతి కూడా ఖరారైపోయింది.
మణిగాంధీ బుధవారం ఉదయం విజయవాడలోని చంద్రబాబునాయుడు ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు.. కర్నూలు జిల్లా పార్టీ నాయకులు శిల్పా సోదరులను కూడా పిలిపించి వారితో భేటీ ఏర్పాటుచేశారు. మొత్తానికి ఆయన కూడా తెదేపాలో చేరిపోతున్నారు.