అధికార పార్టీ టీడీపీ మీద విమర్శలు చేయాలంటే వైకాపా నుంచి ఎమ్మెల్యే రోజా మాత్రమే… అన్నట్టుగా ఒకప్పుడు ఉండేది. కానీ, ఈ మధ్య ఆమె చేస్తున్న విమర్శల్లో పదును తగ్గింది. అంతేకాదు, గతంలో మాదిరిగా కనిపించిన ప్రతీ ఇష్యూ పట్టుకుని మీడియా ముందుకు వచ్చేయడమూ తగ్గించారు! ఆ విమర్శల వల్ల పార్టీకి జరిగే మేలు శాతం తక్కువని, ఉల్టా ప్రభావం ఎక్కువ ఉంటుందని పార్టీ భావించేందేమో తెలీదుగానీ… ఎమ్మెల్యే రోజా జోష్ కొంతవరకూ తగ్గిందనే చెప్పాలి. అయితే, తాజాగా కొన్ని అంశాలను ప్రస్థావిస్తూ టీడీపీ సర్కారుపై విమర్శలుచేశారు రోజా. గడచిన నాలుగేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కారంటూ విమర్శించారు. జగన్ పై హత్యాయత్నం చంద్రబాబే చేయించారనడానికి ఆయన వ్యాఖ్యలే సాక్ష్యమంటూ ఆరోపించారు. జగన్ పై హత్యాయత్నాన్ని విమానాశ్రయంలో ప్లాన్ చేస్తే, అది కేంద్రంపైకి పోతుందని చంద్రబాబు భావించారు అన్నారు రోజా. ఈ కేసును ఎన్.ఐ.ఎ.కి అప్పగిస్తే.. చంద్రబాబు, లోకేష్ లకు అంత బాధ ఎందుకు అని ప్రశ్నించారు.
బీజేపీతో చంద్రబాబు నాయుడు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని రోజా అన్నారు. చంద్రబాబు ఎప్పటికీ మా మిత్రుడే అని రాజనాథ్ సింగ్ అన్నారనీ, ఏపీలో కోట్ల అవినీతి జరుగుతున్నా చంద్రబాబు మీద ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదనీ, టీడీపీ బోర్డు మెంబర్ గా మహారాష్ట్ర భాజపా మంత్రి భార్యకు అవకాశం ఇచ్చారు కదా అని రోజా విమర్శించారు. కర్ణాటక ఎన్నికల తరువాత తననేదో అరెస్ట్ చేసేస్తారంటూ చంద్రబాబు ఆందోళన చెందారనీ, కానీ ఇంతవరకూ ఆ అరెస్టు ఎందుకు జరగలేదని రోజా అన్నారు. ఈరోజు వరకూ మీరు అరెస్ట్ కాలేదంటే అర్థమేంటి… కేంద్రంతో లాలూచీ పడినట్టు కాదా అంటూ ప్రశ్నించారు? జగన్ ఎప్పుడూ ఎవ్వరితోనూ లాలూచీ పడలేదు కాబట్టే, కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు.
రోజా విమర్శలు ఎంత అవుట్ డేటెడ్ గా ఉన్నాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! భాజపాతో టీడీపీ లాలూచి పడుతోందనే విమర్శకు కాలం చెల్లిపోయి చాన్నాళ్లయింది. టీడీపీ, భాజపాలు కలిసి రాజకీయం చేస్తున్నాయనేది సగటు వైకాపా కార్యకర్త కూడా నమ్మడు! కానీ, రోజా ఇంకా అదే అంశాన్ని ప్రచారం చేసే పనిలో ఉన్నారు. ఇంతవరకూ చంద్రబాబు అరెస్ట్ కాలేదంటే… కేంద్రంతో కుమ్మక్కే కదా అని రోజా అనడం మరీ విడ్డూరం. అరెస్టు కాకపోవడం కుమ్మక్కట… అరెస్టు కావడం హీరోయిజమట! జగన్ కేసులు ఎదుర్కోవడం గొప్ప అన్నట్టుగా చెప్పే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. రాజనాథ్ సింగ్ వ్యాఖ్యలు ఎప్పటివి..? ఆ తరువాత టీడీపీ, భాజపాల మధ్య ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి… ఇవేవీ రోజా అప్ డేట్ అయినట్టుగా లేరు.