పెగాసస్ అంశంపై హౌస్ కమిటీ వేయాలని నిర్ణయించుకున్న వైసీపీ… కీలకమైన విషయాలు బయటకు వచ్చి సంచలనం సృష్టించక ముందే కొన్ని కీలక విషయాలను అంగీకరిస్తున్నారు. తమ ప్రభుత్వం నిఘా సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా అసెంబ్లీ దగ్గర మీడియాతో మాట్లాడుూ చెప్పారు. అయితే తాము సంఘ విద్రోహశక్తులపై నిఘా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుతున్నామని.. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం.. వారి వ్యక్తిగత విషయాల్లో ఏం చేస్తున్నారన్న అంశం తెలుసుకోవడానికి కాదని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం నిఘా సాఫ్ట్వేర్లను వాడుతుందని చెప్పడానికి కారణం ఏమిటన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఏ ప్రభుత్వానికైనా ఇంటలిజెన్స్ ఉంటుంది. కొంత నేరస్తులు.. ఇతరులపై నిఘా పెట్టి ఉంచారు. అదంతా కామన్. కానీ గత ప్రభుత్వంపై నిందలేయడానికి..పెగాసస్ పేరుతో..అదీ మమతా బెనర్జీ చెప్పారని ఏకంగా హౌస్ కమిటీ విచారణ చేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా తాము సాఫ్ట్ వేర్లు వాడుతున్నామని కానీ రాజకీయ ప్రత్యర్థులపై వాడటం లేదని చెప్పడంలో ఆంతర్యం ఏమిటనేది అంతుబ ట్టని విషయం. గతంలో హైకోర్టు జడ్జిలపైనా నిఘా పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నిగా సాఫ్ట్ వేర్లను వాడుతున్నట్లుగా అమర్నాథ్ అంగీకరించడం కీలకంగా మారే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవరిపై ఎ సాఫ్ట్ వేర్లతో నిఘా పెట్టారో చెప్పాలన్న డిమాండ్లు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ శాంతిభద్రతల కోణంలోనే నిఘా పెట్టేవాళ్లు.కానీ రాష్ట్రప్రయోజనాల పేరుతో కూడా నిఘా పెడుతున్నారన్న విషయం ఎమ్మెల్యే మాటలతోనే వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో ముందు ముందు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఘా పెడుతున్నారన్న విషయం బయటకు తెలుస్తుందనే ముందుగా గుడివాడ అమర్నాథ్ ద్వారా చెప్పినట్లుగా తెలుస్తోంది. నిఘా అంశం ఇంటలిజెన్స్ చీఫ్.. సీఎం స్థాయిలోనే ఉంటుంది. ఎమ్మెల్యేలకు తెలిసే అవకాశం లేదు.