హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీలో చేసిన వెటకారం బాగా పండింది. ముఖ్యమంత్రి, మంత్రులు – మాటకుముందు ‘మీ కథ చూస్తాం… మీ అంతు తేలుస్తాం’ అని తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని, జాగ్రత్తగా ఉండమంటున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తమను ఏమి చేస్తారోకూడా చెప్పాలని అడిగారు. గోదావరిలోకి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుతారా, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి ఎలుకలతో కొరికిస్తారా, నారాయణ కాలేజికి తీసుకెళ్ళి ర్యాగింగ్ చేయిస్తారా, తాసీల్దార్ వనజాక్షిని కొట్టించినట్లు రౌడీలతో కొట్టిస్తారా, అదీ ఇదీ కాకపోతే ఏలూరు తీసుకెళ్ళి సూదితో పొడిపిస్తారా అని ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాట, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పసికందు మరణం, నారాయణ కాలేజిలో విద్యార్థినుల మృతి, తాసీల్దార్ వనజాక్షి వివాదం, ఏలూరు సిరంజి సైకో ఘటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీధర్ రెడ్డి వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమను ఏదైనా చేయటానికి ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదని, అసెంబ్లీ అని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలు కాకపోతే చర్చకు ఎందుకు రారని ప్రశ్నించారు.