వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఆకర్షించడం మొదలుపెట్టినప్పటి నుంచి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో నేతలు అందరూ ‘తెదేపా అవినీతి సంపాదనను వెదజల్లుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని’ వాదిస్తున్నారు. వైకాపాకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు “తెదేపా మాకు 20 కోట్లు ఆఫర్ ఇచ్చిందని ప్రకటిస్తే మరొకరు నాకు 30 కోట్లు ఆఫర్ ఇచ్చిందని ప్రకటించుకొంటున్నారు. అయితే వారిలో ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు అందుకు సాక్ష్యాధారాలను చూపడం లేదు! కానీ, నేటికీ తెదేపాలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వి.రాజేశ్వరి కూడా తెదేపాలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. వారిలో ఆమె తప్ప మిగిలిన ఇద్దరు చేరడం దాదాపు ఖాయమయింది. ఆమెను పార్టీ బుజ్జగించినందునో ఏమో తను పార్టీ మారడం లేదని ప్రకటించారు.
తనకు కూడా తెదేపా 20 కోట్లు ఆఫర్ ఇచ్చిందని కానీ తనకు ఈ రాజకీయజీవితం ప్రసాదించిన జగనన్నను మోసం చేసి తెదేపాలో చేరలేనని ఆమె చెప్పారు. మరో వైకాపా ఎమ్మెల్యే గిడ్డి రాజేశ్వరి కూడా తనకు వంద కోట్లు ఇచ్చినా పార్టీ మారేది లేదని చెప్పారు. ఈ ఆఫర్లను ఎలాగూ రుజువు చేయనవసరం లేదు కనుక 20 కోట్లేమిటి 100 కోట్లు ఆఫర్ వచ్చినట్లు చెప్పుకోవచ్చును. ఇటువంటి మాటలు వినడానికి చాలా ఆసక్తికరంగానే ఉంటాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే, అవి నిజం కాదని అర్ధమవుతుంది.
పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న తెదేపాకు వైకాపా ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసి కొనగోలు చేయనవసరం లేదని అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే తెరాస వ్యూహాన్నే తెదేపా కూడా ఎంచుకొన్నందునే, తెదేపా కూడా వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందని భావించవచ్చును. కొందరు ఎమ్మెల్యేలు తెదేపాలో చేరుతున్నారంటే వారికి ఏదో రకమయిన ప్రలోభం చూపే ఉంటుందని అనుమానించక తప్పదు. భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి మంచి పలుకుబడి, ప్రజలలో ఆదరణ ఉన్న నేతలని పార్టీలో చేర్చుకోవడం వలన తెదేపాకు ఎంతో కొంత లాభం ఉంటుంది కనుక వారికి పదవులో మరొకటో ప్రలోభం చూపించి పార్టీలోకి ఆకర్షించిందంటే అర్ధముంది. కానీ రాజేశ్వరి వంటి ఎమ్మెల్యేలకు కూడా భారీ ఆఫర్లు ఇస్తోందంటే నమ్మశక్యంగా లేదు.
అటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కానీ కనీసం తమ నియోజకవర్గంలో గానీ గట్టిగా మాట్లాడలేరు. తమ నియోజకవర్గంలో పనులు చేయించుకోలేకపోతున్నారు. ఆ కారణంగా ఏమాత్రం ప్రజాధారణకి నోచుకోవాదం లేదు. అటువంటి వారికి ఒక్కొక్కరికీ తెదేపా 20-30 కోట్లు చెల్లించి పార్టీలో చేర్చుకోవలసిన అవసరం ఏమిటి? చేర్చుకొన్నా అటువంటివారి వలన పార్టీకి ఏమి ప్రయోజనం ఉంటుంది? దాని బదులు ఆ నియోజక వర్గాలలో తెదేపా నేతల ద్వారానే ఆ పనులన్నీ చేయించినట్లయితే, సదరు తెదేపా నేతకి, పార్టీకే పూర్తి క్రెడిట్ దక్కుతుంది కదా దాని వలన అక్కడ సదరు నేత, పార్టీ బలపడతాయి కదా? అప్పుడు వచ్చే ఎన్నికలలో వైకాపాని ఎదుర్కోవడం ఇంకా సులువవుతుంది కదా? అని ఆలోచిస్తే వైకాపా ఎమ్మెల్యేల ఈ ‘ఆఫర్ ప్రకటనలు’ ఎంత అర్ధరహితంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చును. అయితే అలాగ చెప్పుకోవడం కూడా ఇప్పుడు ఫేషన్ అయిపోయింది కనుక చెప్పుకొంటున్నారని జనాలు సర్దిచెప్పుకోక తప్పదు. అలాగ చెప్పుకొంటే వైకాపా అధిష్టానం కూడా తమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తుందని ఆశ పడుతున్నారనుకోవలసి ఉంటుంది. అంతే!