వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో వైరాగ్యం కనిపిస్తోంది. ఈ రోజు ఈ పార్టీలో ఉంటా…రేపు ఏ పార్టీలో ఉంటానో తెలియదని కామెంట్లు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో వెల్లంపల్లి లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేయగా.. తాజాగా ఈ బాధ్యతను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు తీసుకున్నారు. సందర్భం లేకపోయినా ఆయన తన పార్టీకి ఓ సందేశం పంపారు. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నా.. రేపు ఏ పార్టీలో ఉంటానో చెప్పలేనన్నారు.
ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘‘ఈ పార్టీలు శాశ్వతం కాదు, నేను ఈ రోజు ఈ పార్టీలో ఉంటాను, రేపు పోతాను. రేపటి రోజున ఈ పార్టీ నుండి ఇక్కడ నుండి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు? పార్టీలు ఎంతమంది మారటంలేదు’’ అంటూ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను ఉన్నంతవరకు సక్రమంగా చూసుకోవడం నా బాధ్యత. టెక్నికల్ సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందించి అవకాశం ఉన్నంతవరకు బాధితులకు సంక్షేమ పథకాలు అందేలా చూడండి’’ అంటూ ఎమ్మెల్యే మాట్లాడారు.
జ్యోతుల చంటిబాబు గతంలో తెలుగుదేశం పార్టీ నేత. ఆయితే జ్యోతుల నెహ్రూ వైసీపీలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరినప్పుడు ఆయన వైసీపీలో చేరారు. విజయ సాధించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డితో భేటీ తర్వాత తనకు టిక్కెట్ వస్తుందన్న నమ్మకం కోల్పోయారని అందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.