చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అత్యంత దారుణమైన వ్యాఖ్యలను అసెంబ్లీలో చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు అత్యంత నీచమైన మాటలు మాట్లాడారు. దీన్ని స్పీకర్ కూడా అడ్డుకోలేదు. దీంతో చంద్రబాబు కంటి తడి పెట్టుకున్నారు. ఇంత దారుణమైన అవమానాల్ని తన జీవితంలో చూడలేదని.. ప్రజా సమస్యలపై చర్చ కోసం తాను ఇంత కాలం భరిస్తూ వచ్చానని ఇప్పుడు తన భార్యనూ రోడ్డు మీదకు లాక్కొచ్చారని ఆయన కంటతడి పెట్టుకున్నారు.
ఈ సమయంలో సీఎం జగన్ పగలబడి నవ్వుతూ కనిపించారు. మళ్లీ సీఎంగానే సభకు వస్తానని ప్రకటించారు. చంద్రబాబుకు ఈ మాటలు చెప్పేందుకు కూడా అధికార పార్టీ సభ్యులు అవకాశం ఇవ్వలేదు. ఆయన మైక్‌ను స్పీకర్ మధ్యలో కట్ చేశారు. అసెంబ్లీ మొదటి రోజునే చంద్రబాబును ఘోరంగా అవమానించాలన్న ఎజెండా సీఎం జగన్ బయట పెట్టారు. కుప్పం ఓడిపోయాక ఆయన మొహం చూడాలని ఉందంటూ కామెంట్లు చేశారు. ఈ రోజు చంద్రబాబు సభలోకి రాగానే… కొడాలి నాని, అంబటి రాంబాబు సహా అందరూ చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడానికే ప్రయత్నించారు.
అది శృతి మించిపోయింది. ఓ యువతితో అసభ్యంగా మాట్లాడుతూ రెండు సార్లు దొరికిపోయిన అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తానని.. వైసీపీ పతనంచూసిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేసి వెళ్లారు.