అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేది వాలంటీర్లేనని వైసీపీ ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు. కొంత మంది బహిరంగంగానే ఈ విషయం చెబుతున్నారు. వాలంటీర్లకు రోడ్డు పక్కన వేసిన చిన్న టెంట్లో సన్మానం చేసిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి … వాలంటీర్లే తమను గెలిపిస్తారన్నట్లుగా చెప్పుకొచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలకు లేని పవర్ జగన్ వాలంటీర్లకు ఇచ్చారని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ప్రజలెవరూ సమస్యల పరిష్కారం కోసం.. తమ వద్దకు రావడం లేదని తెలిపారు.
అందరూ వాలంటీర్ల దగ్గరకే వెళ్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులనే బూత్ అధికారులుగా నియమిస్తారని తెలిపారు. వారి చేతుల మీదుగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. బాలనాగిరెడ్డి మాటలు విని వార్డు వాలంటీర్లు కూడా పొంగిపోయారు. ఎమ్మెల్యేల కంటే తమకే ఎక్కువ అధికారంఉందనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండటంతో .. ఆ యాభై ఇళ్ల సమాచారం వాలంటీర్ కు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లో ఉంటుంది. వారందరూ ప్రభుత్వ పథకాలు అందిన వారిని బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి.
ఓ దశలో వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని.. వారి వద్ద ఉన్న ఫోన్లన్నింటినీ స్వాధీనం చేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. తర్వాత తిరుపతి, బద్వేలు ఉపఎన్నికల్లోనూ ఈ వివాదం వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే గెలుస్తామని హైకమాండ్… వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పిందేమోకానీ.. వారు మాత్రం గాల్లోతేలిపోతున్నారు. ఉండబట్టలేక బయటకు చెప్పేస్తున్నారు.