ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఎమ్మెల్యేలను తెలుగు దేశం పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు తెదేపా కూడా చాలా విచిత్రమయిన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఇంతవరకు తమ పార్టీ నేతలను తెరాసలో చేర్చుకొన్నప్పుడు తాము చేసిన విమర్శలు, విసిరిన సవాళ్లను ఇప్పుడు వైకాపాతో చేస్తుంటే దానికి ఏవిధంగా సమాధానాలు చెప్పుకోవాలో తెలియడం లేదు. తెరాసలో తెదేపా తమ్ముళ్ళ చేరికకి, తెదేపాలో వైకాపా ఎమ్మెల్యేల చేరికకి తేడా ఉందని ఏవిధంగా సమర్ధించుకోవాలో తెలియని పరిస్థితి. తలసాని యాదవ్ రాజీనామాకు, ఉపఎన్నికలకు డిమాండ్ చేస్తున్న తెదేపా, ఆంధ్రాలో మాత్రం ఆ నియమం తమకు వర్తించదని చెపుతోంది. కానీ దానిని ఏవిధంగా సమర్ధించుకోవాలో తెలియడం లేదు.
తెదేపా ప్రధాన కార్యదర్శి బొండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ “రాష్ట్రాభివృద్ధిని కోరుతున్న వారు, దానిలో పాలు పంచుకోవాలనుకొంటున్న వారే మా పార్టీలో చేరుతున్నారు. వారి చేత రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కనుక మా పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలనుకోవడం లేదు,” అని చెప్పారు.
మరి అటువంటప్పుడు తెలంగాణాలో తెరాసలో చేరే తెలుగు తమ్ముళ్ళు కూడా అదే మాట చెపుతున్నారు కదా..వారు రాజీనామాలు చేసి ఉపఎన్నికలు తెచ్చినట్లయితే అక్కడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది కదా? అని ఇప్పుడు తెరాస ప్రశ్నించవచ్చును. ఈ వ్యవహారంలో ఏపిలో తెదేపా వ్యవహరిస్తున్న తీరు, అది చెపుతున్న ఇటువంటి మాటల వలన తెలంగాణాలో తెదేపా నేతలు ఇక తెరాసను వేలెత్తి చూపే అవకాశం లేకుండా పోయింది. పైగా ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారు తెదేపాను ప్రశ్నించగలుగుతున్నారు.
బయట పార్టీల వాళ్ళను చేర్చుకోవడం వలన తెరాసకు అంతర్గతంగా ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయో, ఆంధ్రాలో తెదేపాకు కూడా ఇప్పుడు సరిగ్గా అటువంటి సమస్యలే ఎదుర్కోవలసివస్తోంది. ఇవ్వన్నీ చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలలో వలసలు ప్రోత్సహించడం వలన లాభాల కంటే నష్టాలు, ఇబ్బందులే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయినా తెదేపా వైకాపా ఎమ్మెల్యేలను ఆకర్షించాలని ప్రయత్నిస్తూనే ఉంది.