తెలంగాణాలో కేసీఆర్ అమలు చేస్తున్న ఆకర్ష పధకాన్నేఆంద్రాలో చంద్రబాబు నాయుడు కూడా యధాతధంగా అమలుచేస్తూ రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాను నిర్వీర్యం చేసి వచ్చే ఎన్నికలలో ఏకపక్షంగా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని కలలు కంటున్నారు. ఆయన తెదేపా గేట్లు తెరవగానే 8మంది వైకాపా ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ లోపాలకి వచ్చేసారు. ఇంకా చాలా మంది బయట క్యూలో నిలబడి ఉన్నారని తెదేపా నేతలు చెపుతున్నప్పటికీ, దానికి వైకాపా బయటపెట్టిన అమరావతి భూ కుంభకోణాలు తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లున్నాయి. అందుకే మళ్ళీ కొత్తగా ఎవరూ తెదేపాలోకి రాలేదు. ఒక్కో ఎమ్మెల్యేకి తెదేపా రూ.20 కోట్లు నగదు బహుమతి, కాంట్రాక్టులు, రాజధాని ప్రాంతంలో భూములు వగైరా చాలా ఆఫర్లు ఇస్తోందని వైకాపా నేతల ఆరోపిస్తున్నారు. కానీ అదంతా వట్టిదే…తమతమ నియోజక వర్గాల అభివృద్ధి పనుల కోసం, రాష్ట్రభివృది కోసమే తెదేపాలో చేరుతున్నారని తెదేపా వాళ్ళు అందులో చేరేవాళ్ళు కూడా కోరస్ పడుతున్నారు. కనుక ఆ రెండు పార్టీలు చెపుతున్నవాటిలో ఏదో ఒకటి నిజమేనని జనాలు సరిపెట్టుకోకతప్పదు.
అయితే తెదేపా గేట్లు తెరిచిందని సంబరపడిపోతూ లోపలకి దూరిపోదామనుకోవడం మంచిదేనా కాదా అంటే కాదనే చెప్పవచ్చును. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేసారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఇప్పుడు చాలా మంది ఆ పార్టీలో చేరుతున్నామని చెప్పుకొంటున్నా వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఆశిస్తారు కనుక ఈ విపరీతమయిన పోటీ కారణంగా అందరికీ టికెట్స్ దొరికే అవకాశం ఉండకపోవచ్చును. పైగా అప్పుడు మరి కొంతమంది వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు బారీ పెట్టుబడులతో వస్తే వారికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తారు తప్ప అభివృద్ధి కోసం వచ్చిన వారికి కాదు. కనుక ఇప్పుడు లోపలకి ప్రవేశిస్తున్న వారిలో చాలా మంది రిటర్న్ జర్నీకి సిద్దపడవలసి రావచ్చును.
తెదేపా అధికారం చేపట్టిన రోజుకి, నేటికీ మధ్య దాని ట్రాక్ రికార్డును గమనించినట్లయితే దాని గ్రాఫ్ క్రమంగా క్రిందకు పడిపోతున్నట్లు కనబడుతోంది. అందుకు అనేక కారణాలున్నాయి. అవన్నీ ప్రజలకు కూడా తెలుసు కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకొని బాధపడనవసరం లేదు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి జగన్ ప్రత్యామ్నాయం కాకపోవడమే తెదేపా అదృష్టమనుకోవాలి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి శక్తిని, ప్రజాధారణని తక్కువ అంచనా వేయడానికి లేదు. జగన్ ఎంత దుందుడుకుగా వ్యవహరిస్తున్నా, అతనిపై ఎన్ని సిబీఐ కేసులున్నా ప్రజలలో ఆయన ఆదరణ కోల్పోలేదు. కనుక వైకాపా నుండి మరో పాతిక మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయన ఇంటి ముందు కూడా రాజకీయ నేతలు పెద్ద క్యూ కట్టడం తధ్యం.
వచ్చే ఎన్నికలలో కూడా వైకాపాను గెలిపించుకోలేకపోతే ఇంకా ఆ పార్టీ మనుగడ సాగించడం కూడా కష్టమవుతుంది కనుక వచ్చే ఎన్నికలు ఆయన రాజకీయ జీవితానికి జీవన్మరణ సమస్య వంటివి. కనుక ఆయన తెదేపాకు చాలా గట్టి పోటీ ఇవ్వవచ్చును.
వచ్చే ఎన్నికలలో తెదేపా, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా లేక విడిపోతాయా అనే దానిని బట్టి రాజకీయ బలాబలాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం తెదేపా, బీజేపీల మధ్య సఖ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. కనుక అవి వచ్చే ఎన్నికలలో కలిసే పోటీ చేస్తాయో లేదో వాటికే తెలియదు. ఒకవేళ తెదేపా, బీజేపీలు విడిపోయి, బీజేపీ వైకాపాతో చేతులు కలిపితే తెదేపాకి ఎదురీత తప్పకపోవచ్చును.
రాష్ట్రానికిచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం పట్టించుకోనందుకు వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి, ఆ కారణంగా దానితో చేతులు కలిపే పార్టీ కూడా ఎంతో కొంత నష్టపోవచ్చును. కానీ మిగిలిన ఈ మూడేళ్ళలో రాష్ట్రం పట్ల దాని వైఖరి మారినట్లయితే దానిపట్ల ప్రజల వైఖరిలో కూడా మార్పు రావచ్చును. అప్పుడు అది ఏ పార్టీతో జత కడితే ఆ కూటమికి విజయావకాశాలు మెరుగుపడవచ్చును. కనుక వైకాపా నేతలు ఇప్పుడు హడావుడిగా తెదేపాలో జేరిపోవాలని ఆత్రపడిపోవడం కంటే తెదేపా, బీజేపీల పొత్తుల వ్యవహారం తేలిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. లేకుంటే ఆనక తాపీగా పశ్చాతాపపడవలసి వస్తుంది.