ముందే చెప్పుకొనట్లుగా వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు తెదేపాలో చేరబోతున్నారు. వారిద్దరూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడుని ఆయన నివాసంలో కలిసి, తెదేపాలో చేరాలనుకొంటున్నట్లు చెప్పినట్లు సమాచారం. అందుకు ఆయన వారిని అభినందించి పార్టీలోకి స్వాగతం పలికారని సమాచారం. కనుక నేడో రేపో వారివురు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరడం ఖాయం.
ఇంతవరకు తెదేపాతో భీకరంగా పోరాడిన జ్యోతుల నెహ్రూ, సుబ్బారావు ఇప్పుడు తెదేపాలోనే చేరాలనుకావడంతో సహజంగానే తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకిస్తారు. కనుక వారితో సర్దుబాట్లు చేసుకొని ఏవిధంగా అందరూ కలిసి పనిచేయాలనే విషయంపై వారు ముగ్గురూ తమ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) ఈ మధ్యనే ఆకస్మికంగా మృతి చెందారు కనుక అదే నియోజకవర్గానికి చెందిన సుబ్బారావుకి తెదేపాలో చేరినా ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ఆయన భావిస్తున్నారు.
వారిద్దరిలో జ్యోతుల నెహ్రు పార్టీలో చాలా సీనియర్ నేత, జిల్లాలో రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను బుజ్జగించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన వైకాపాలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ప్రజా పద్ధుల కమిటీ చైర్మన్ పదవిని కొత్తగా శాసనసభ్యుడిగా ఎన్నికయిన బుగ్గన రాజేంద్రనాథ్ కి కట్టబెట్టినందుకు అలిగి పార్టీని వీడుతున్నారు. అంటే జగన్ తీసుకొన్న మరో తొందరపాటు నిర్ణయం వలన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కోల్పోతున్నట్లు స్పష్టమవుతోంది.