విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు గంటా శ్రీనివాసరావు .. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తే.. రాజీనామాలు చేయడం వల్ల లాభం ఏముంటుందని వాదించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు … మూడు రాజధానుల కోసం రాజీనామా చేస్తానని ప్రకటించారు. విశాఖలో రాజధాని కోసం అంటూ.. నాన్ పొలిటికల్ జేఏసీ అని వైసీపీ నేతలు.. సానుభూతిపరులతో ఓ జేఏసీ ఏర్పాటు చేసి. ఆ కమిటీకి రాజీనామాలు ఇస్తున్నామహో అని వైసీపీ ఎమ్మెల్యేలు హడావుడి ప్రారంభించారు. అందులో ఒక్కరే జేఏసీకి లేఖ ఇచ్చారు.
అదీ కూడా తప్పుడు ఫార్మాట్లో ఉంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.,.టీడీపీ కి వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేస్తున్నానని లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఎందుకూ పనికి రాదు.రాజీనామా చేసే ఎమ్మెల్యే తన లేఖలో రాజీనామా చేస్తున్నా అని మాత్రమే చేయాలి. వేరే ఏ ఫార్మాట్లో రాజీనామా చేసినా అది చెల్లదు. కానీ ధర్మశ్రీ.. కారణాలు, ఉద్దేశాలు రాజీనామాలేఖలో రాసిచ్చారు.
అసలు స్పీకర్ ఫార్మాట్లో స్టీల్ ప్లాంట్ కోసం గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన లేఖను స్పీకర్ సీతారాం ఇంత వరకూ ఆమోదించలేదు. ఇలాంటి లేఖలను ఆమోదించే అవకాశం లేదు. కానీ.. ప్రజల్లో సెంటిమెంట్ రేపాలనే ప్రయత్నంలో తమదైన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రైతుల పాదయాత్ర విశాఖకు దగ్గరయ్యే కొద్దీ ఇలాంటివిచాలా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.