సమస్యలు పరిష్కరించమని వస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో తోచడం లేదు. రివర్స్‌లో రాజకీయం చేస్తే బెటర్ అని డిసైడైపోతున్నారు. అంటే.. తామే సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఆ సమస్యల పరిష్కార ప్రయత్నం ఏమిటంటే.. అధికార పార్టీ పలుకుబడితో సమస్యలు పరిష్కరించడం కాదు.. ధర్నాలు చేయడం. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఏపీలో ఇదే రివర్స్ రాజకీయం నడుస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుని మరీ… నెల్లూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. కారణం ఏమిటంటే.. కోవిడ్ కారణంగా విధుల్లోకి తీసుకున్న వారికి జీతాలివ్వడంలేదు. ఇప్పుడు.. కరోనా తగ్గిపోయిందని వారందరకీ జీతాలివ్వకపోగా.. విధుల్లోంచి తీసేస్తున్నారు.
ఎమ్మెల్యేగా వారి బాధలు చూడలేక కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డి.. ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆయననేరుగా ముఖ్యమంత్రిని విమర్శించలేరు. అలా విమర్శించడం.. రివర్స్ రాజకీయాల్లో భాగం కాదు కాబట్టి..ఆయన అధికారులపై నిందలేస్తూ మాట్లాడారు. దీంతో ఆయన తమ కోసం పోరాడుతున్నారని.. జీతాలు రాని కరోనా వారియర్స్ సంతృప్తి చెందారు. కానీ.. ఆయన వైసీపీ ఎమ్మెల్యే అని.. ఆయన చెబితే.. జీతాలు వస్తాయనే ఆలోచన మాత్రం వారి మనసులోకి రానీయకుండా.. పోరాడి సాధిద్దామనే భావనను మాత్రం ఎమ్మెల్యే వారికి కల్పించడంలో సక్సెస్అయ్యారు. అధికార పార్టీగా రివర్స్ పాలిటిక్స్ ఎలా చేయాలో చూపించారు.
నిజానికి ఈ ప్లాన్ ఒక్క కోటంరెడ్డి దే కాదు.. అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలుఅమలు చేస్తున్నారు. ఇసుక దొరకడంలేదని ఎవరైనా ప్రజలు వెళ్తే.. ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. దీంతో ప్రజలు వైసీపీ తప్పేం లేదు.. అంతా అధికారులదే అనుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇదేదో బాగుందనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..ఇతర విషయాల్లోనూఅదే కంటిన్యూ చేస్తున్నారు. చివరికి ప్రజలు కూడా.. తమ ఎమ్మెల్యేల చేతుల్లో ఏమీ లేదనుకునే పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఈ రివర్స్ పాలిటిక్స్ ఎంత కాలం వర్కవుట్ అవుతాయో కానీ.. ఇప్పుడు మాత్రం.. జోరుగా సాగుతున్నాయి.