ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం అవుతోంది. విచిత్రంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు .. ఒక్కో రోజు బయటకు వచ్చి తమకు టీడీపీ ఆఫర్ ఇచ్చిందని చెప్పుకోవడం ప్రారంభిస్తారు. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఆఫర్ వదిలేశామని.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా జగన్ వెంటే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అసలు వీరందరికీ ఆఫర్లు వస్తే ముందే చెప్పకుండా ఎన్నికలైపోయిన వారానికి ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వస్తున్నారన్నది అంతు చిక్కని విషయంగా మారింది.
మొదట జనసేన తరపున గెలిచి వైసీపీకి ఓటేసిన రాపాక వచ్చారు… తర్వాత టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి ఓటేసిన మద్దాలి గిరి వచ్చారు. ఇప్పుడు వైసీపీ నుంచే గెలిచి.. బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి రాజకీయానికి తరచూ కన్నీళ్లు పెట్టుకునే ఎమ్మెల్యే ఆర్థర్ బయటకు వచ్చారు. తమకూ టీడీపీ ఆఫర్ ఇచ్చిందన్నారు. అయితే ఇదంతా వైసీపీ హైకమాండ్ చెప్పిస్తోందా లేకపోతే.. తాము పార్టీకి విధేయంగా ఉన్నామని చెప్పుకుని టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకునేందుకు తమ పార్టీ హైకమాండ్‌తో మైండ్ గేమ్ ఆడుతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ఎమ్మెల్సీగా అనూరాధను పోటీ పెట్టినప్పుడే బేరసారాలు జరుగుతాయని జగన్ అనుమానించి ఉంటారు. పూర్తిస్తాయిలో ఇంటలిజెన్స్ ను ఉపయోగించి ఉంటారు. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలందరిపై పూర్తిస్థాయి నిఘా పెట్టడమే కాదు.. తాను స్వయంగా మాట్లాడారు కూడా. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు నలుగురు కాదు నలభై మంది టీడీపీలో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూండటంతో… తమకు ఆఫర్ వచ్చిందని.. కానీ తిరస్కరించామని కొంత మంది తెరపైకి రావడం అనూహ్యంగా మారింది. ఏదో తేడా రాజకీయం నడుస్తోందననే గుసగుసలు వైసీపీలో వినిపిస్తున్నాయి.