శాసనమండలి రద్దు తీర్మానం విషయంలో వైసీపీ ఫ్లోర్ మేనేజ్మెంట్లోని డొల్లతనం బయటపడింది. ఓటింగ్ నిర్వహించాలని ముందస్తుగా.. వ్యూహ సమావేశంలోనే నిర్ణయించారు. తీర్మానంపై చర్చ ముగిసే సమయానికి సభ్యులందరూ ఓటింగ్‌కు సిద్ధంగా ఉండాలని.. విప్‌లు అందరికీ ఆదేశాలిచ్చారు. తీరా జగన్మోహన్ రెడ్డి స్పీచ్ పూర్తయి… ఓటింగ్ జరిగే సమయానికి 121 మందే ఉన్నారు. ఓటింగ్ నిర్వహించిన తర్వాత అధికారులు లెక్క వేసి.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇస్తే.. ఆయన.. అదే సంఖ్యను ప్రకటించబోయారు. ఉలిక్కిపడిన అధికారపక్షం పెద్దలు.. మధ్యలోనే నిలిపివేయించారు.
సభలో మూడింట రెండు వంతుల మెజార్టీతో తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంది. 121 మంది మాత్రమే అనుకూలంగా ఓట్లు వేసినట్లు తేలడంతో.. మరోసారి ఓట్లు లెక్కించేలా స్పీకర్ కు సూచనలు వెళ్లాయి. దాంతో అసెంబ్లీ అధికారులు హడావుడిగా మరోసారి లెక్కలేసి…133 మంది సభ్యులు ఉన్నారని.. వారంతా.. తీర్మానానికి అనుకూలంగా ఓట్లేశారని తేల్చారు. ఇదే సంఖ్యను స్పీకర్ ప్రకటించి.. తీర్మానం ఆమోదం పొందినట్లు తెలిపారు. ఆ తర్వాత సభను వాయిదా వేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి.. ఓటింగ్ ఉంటుందని తెలిసినా కూడా 121 మంది మాత్రమే రావడంతో.. జగన్ కూడా అసహనానికి గురయ్యారు.
133మంది వచ్చారని.. ఎలాగోలా సర్ది చెప్పుకున్నా…ఫ్లోర్ మేనేజ్మెంట్పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. మొత్తంగా ఓటింగ్ సమయంలో 19 మంది సభ్యులు గైర్హాజరుకావడం ఏంటని నిలదీశారు. చివరికి సభ్యులందర్నీ ఓటింగ్ కు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న విప్‌లు చెవిరెడ్డి, దాడిశెట్టి రాజా కూడా… ఓటింగ్ సమయంలో లేకపోవడం పట్ల వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మండలి తీర్మానంపై ఓటింగ్ ఉందని… సభ్యులకు ముందే ఎందుకు చెప్పలేదని జగన్ ఆగ్రహించినట్లుగా చెబుతున్నారు.