వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజాని హైకోర్టు ఆదేశించినా శాసనసభలోకి అనుమతించనందుకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ శాసనసభ ఆవరణలోని గాందీ విగ్రహం వద్ద ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. స్పీకర్ ఆదేశానుసారం రోజాను శాసనసభలోకి ప్రవేశించకుండా మార్షల్స్ అడ్డుకొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను తనకు చూపించమని లేకుంటే రోజాను సభలోకి వెళ్ళనివ్వాలని వాదించేరు. కానీ స్పీకర్ లిఖిత పూర్వకంగా తమకు ఆదేశాలు ఇవ్వలేదని కేవలం మౌకిక ఆదేశాలు మాత్రమే ఇచ్చేరని చెప్పారు. కొద్దిసేపు వారి మధ్య ఘర్షణ జరిగిన తరువాత వైకాపా సభ్యులు అందరూ గాందీ విగ్రహం వద్ద ధర్నాకి కూర్చొన్నారు. మరికొద్ది సేపటిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని గవర్నర్ నరసింహన్ న్ని కలిసి తెదేపా ప్రభుత్వంపై పిర్యాదు చేయబోతున్నారు.
ఈ పరిణామాలపై మంత్రి పీతల సుజాత స్పందిస్తూ “రోజా హైకోర్టుని తప్పుద్రోవ పట్టించి ఆ ఆదేశాలు తెచ్చుకొన్నారు. ఇంత జరిగినా ఆమెకు ఇంకా పొగరు తగ్గలేదు. ఆమెకు శాసనసభలో ప్రత్యక నియమ నిబంధనలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆమె ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరూ కూడా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే,” అని అన్నారు.
ఈ వ్యవహారంలో తెదేపా, వైకాపాలు రెండూ తప్పులు చేస్తూనే ఉన్నాయి. రోజాని శాసనసభలోకి మార్షల్స్ అనుమతించనపుడు, జగన్మోహన్ రెడ్డి వారితో వాదోపవాదాలు చేయడం చాలా తప్పు. వారు స్పీకర్ ఆదేశాలకు లోబడి తమ విధులు నిర్వరిస్తున్నారు తప్ప తమంతట తాముగా ఆ నిర్ణయం తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కనుక వారు అడ్డుకొన్నప్పుడు వారితో వాగ్వాదాలు చేసి తన స్థాయిని దిగజార్చుకొన్నట్లే అయ్యింది.
ఇంకా హైకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించనవసరం ఉందా లేదా అనే న్యాయపరమయిన అంశాన్ని పక్కన బెట్టి ఆలోచిస్తే, రోజాను సభలోకి అనుమతించకుండా విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ కారణంగా న్యాయవ్యవస్థతో కూడా యుద్ధం చేయవలసివస్తే అది మరొక సమస్యగా తయారవుతుంది. పైగా తెదేపా ప్రభుత్వమే స్వయంగా రోజాకు మరింత ప్రచారం కల్పించినట్లవుతోంది.