వైకాపా నుంచి తెదేపాలో చేరిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రు, డేవిడ్ రాజు నిన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ వ్రాశారు. ఆయన రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతూ రాష్ట్రానికి సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా ప్రభుత్వం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నా జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పనులు చేపట్టిణా వాటిని వ్యతిరేకించడమే పార్టీ విధానంగా చేసుకొని అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అహంభావం, అసహనం, మాట నిలకడా లేని మిమ్మల్ని మీ పార్టీ నేతలు కూడా నమ్మడం లేదు. ఇంక ప్రజలెందుకు నమ్ముతారని తమ లేఖలో ప్రశ్నించారు.
వారు ముగ్గురూ వైకాపాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తలూపుతూ, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడు తెదేపాలో ఉన్నందున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. అప్పుడు జగన్ మెప్పు పొందడానికి చంద్రబాబూని విమర్శిస్తే, ఇప్పుడు చంద్రబాబు మెప్పు పొందడానికే జగన్ని విమర్శిస్తున్నట్లు భావించవచ్చు. కనుక ఒకవేళ వాళ్ళు ముగ్గురూ మళ్ళీ వైకాపాలోకి వెళ్లిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడుని విమర్శించినా ఆశ్చర్యం లేదు.
ముద్రగడ పద్మనాభం దీక్ష వ్యవహారాన్ని ఏవిధంగా పరిష్కరించాలో తెలియక ఇబ్బందిపడుతున్న తెదేపా ప్రభుత్వంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. తెదేపా నేతలు, మంత్రులు దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పటికీ ప్రయోజనం కనబడటం లేదు. జగన్ తెర వెనుక ఉండి కాపు నేతల సమావేశం ఏర్పాటు చేసి వారి చేత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేలా చేయగలిగారు. దానితో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన, వైకాపాలో చాలా సీనియర్లుగా పేరున్న భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రు, డేవిడ్ రాజులతో లేఖాస్త్రాలు సందించినట్లు కనబడుతోంది. కానీ దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండబోదు. మళ్ళీ వైకాపా వారిపై కూడా ఎదురుదాడి చేయవచ్చు. పార్టీ మారినా రాజీనామాలు చేయని పిరికిపందలని, వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారని విమర్శలు గుప్పించవచ్చు. జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలచేతే విమర్శింపజేయడం కంటే, ముద్రగడ పద్మనాభం సమస్యని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కదా?