ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిని చేసినట్లుగా ఉత్తుత్తినే చేశారో స్పష్టత లేదు. గౌతంరెడ్డి ఇప్పుడు కీలక పదవిలో ఉన్నారు. వంగవీటి రంగా కుమారుడ్ని మాత్రం అవమానకరంగా పార్టీ నుంచి పంపేశారు. ఇప్పుడు అనంతబాబును కూడా బాగా ఆలోచించి ఆలోచించి తప్పదన్నట్లుగా సస్పెండ్ ప్రకటన చేశారు.
హత్య కేసు నుంచి ఆయనను రక్షించడానికే వైఎస్ఆర్సీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోందని అందుకే పోలీసులు ఆయన విషయంలో చాలా రిజర్వ్‌గా వ్యవహరిస్తున్నారని .. సరిగ్గా విచారణ చేయడం లేదన్న విమర్శలను విపక్ష నేతలు చేస్తున్నాయి. స్వయంగా హత్య చేసినట్లుగా అంగీకరించినా ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని … ఆయన వైఎస్ఆర్సీపీ పెద్దలకు సన్నిహితుడని అందుకే ఆయనపై చర్యలు తీసుకోరని ప్రచారం చేస్తున్నారు.
అదే సమయంలో అమలాపురం ఘర్షణలను కూడా అనంత్ బాబు కేసును పక్క దోవ పట్టించడానికే అధికార పార్టీ చేయించిందని వవన్ కల్యాణ్ , అచ్చెన్నాయుడు సహా పలువురు విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్సీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన పై చాలా వీక్‌గా కేసు పెట్టారని … కావాలని చంపలేదన్నట్లుగా పోలీసులు కూడా నివేదిక రెడీ చేస్తున్నారని ఈ కారణంగా ఆయన త్వరగానే బెయిల్ వస్తుందని చెబుతున్నారు. సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ ఆయనే వచ్చి ఏజెన్సీ వ్యవహారాలు చూసుకుంటారని… అగ్రనేతలు ఇప్పటికే అనంతబాబు అనుచరులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.