హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయలేదని విపక్షాలు ఆందోళన చేస్తూంటే అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని పోలీసులు చివరికి తమ అదుపులోనే ఉన్నట్లుగా సమాచారం లీక్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ అంగీకరించారని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందునే హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ చెప్పారని కాకినాడ పోలీసులు మీడియాకు సమాచారం లీక్ చేశారు. మిగతా వివరాలు తర్వతా చెబుతామంటున్నారు. హత్యలో ఇంకెవరూ పాల్గొనలేదని.. తాను ఒక్కడినే హత్య చేసినట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఎమ్మెల్సీ అనంతబాబు హత్య ఘటన తర్వాత బహిరంగంగా తిరిగారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారికంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన తర్వాత ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన నేరుగా వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ కూడా అదే ఆరోపించారు. ఆ తర్వాత ఆయన నేరుగాపోలీసుల వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనను జైలుకు పంపించాల్సి వస్తుందనే ఉద్దేశంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోనే విచారణపేరుతో ఉంచేశారని అంటున్నారు. ఆయన బెయిల్ ప్రయత్నాలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
నిజంగానే ఎమ్మెల్సీ హత్య చేసినట్లుగా అంగీకరించారా.. అసలేం జరిగింది అన్న వివరాలను పోలీసులు సాయంత్రం బయటకు వెల్లడించే అవకాశం ఉంది. ఈ వ్యవహారం రాజకీయంగా వైఎస్ఆర్సీపీ అరాచకాలపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరిగేందుకు కారణం అయింది. పోలీసుల విశ్వసనీయతపైనా ప్రజల్లో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు మరింత బలపడేలా చేసింది. వైసీపీ నేతలయితే హత్యలు చేసినా ఎవరూ పట్టించుకోరన్న విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో ఎమ్మెల్సీని అరెస్ట్ చూపించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆయనను ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లుగా చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పోలీస్ కార్యాలయంలోనే విచారణ చేస్తున్నామని చెప్పడమే దీనికి ఉదాహరణగా భావించవచ్చు.