వైకాపా నుంచి ఫిరాయింపులు పూర్తిగా నిలిచిపోయాయని భావిస్తుంటే మళ్ళీ మొదలైనట్లు కనిపిస్తోంది. రాజమండ్రిలో ప్రముఖ నేతగా పేరున్న వైకాపా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీని వీడబోతున్నట్లు ఇవ్వాళ్ళ ప్రకటించారు. ఈనెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నట్లు తెలిపారు. అప్పారావు, ఆయన కుమారుడు శ్రీనివాస్ ఫోటోలతో తెదేపా బ్యానర్లని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు కూడా.
తూర్పు గోదావరి జిల్లాలో చాలా బలమైన నేతగా పేరున్న అప్పారావు పార్టీని వీడటం వైకాపాకి చాలా పెద్ద దెబ్బే అవుతుంది. ఇక్కడితో ఈ ఫిరాయింపులు ఆగుతాయా మళ్ళీ ఊపందుకొంటాయో తెలియదు. గతంలో ఫిరాయింపులు జోరందుకొన్నప్పుడు ఒకసారి తెదేపా నేతలు, మంత్రులు రాజధానిలో బినామీ పేర్లతో భూముల కొంటున్న సంగతి బయటపెట్టి తెదేపాని కట్టడి చేయగలిగారు. ఆ తరువాత డిల్లీ వెళ్లి తెదేపా ప్రభుత్వ అవినీతి గురించి టాంటాం చేసి వచ్చారు. ఆ తరువాత తెలంగాణా ప్రాజెక్టులు వ్యతిరేకిస్తూ కర్నూలులో దీక్ష చేసి ఫిరాయింపులకి బ్రేక్స్ వేయగలిగారు. కనుక మళ్ళీ ఇప్పుడు కూడా ఫిరాయింపులని కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి తెదేపా బలమైన ‘అవినీతి అస్త్రం’ ఏదో సందించవచ్చు.