స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న షెడ్యూల్లోనే పూర్తి చేయాలనుకుంటున్న ఏపీ సర్కార్… దానికి అన్ని మార్కాలను వెదుక్కుంటోంది. ఒకటి తర్వాత ఒకటి…ఏ వైపు నుంచి కుదిరితే.. ఆ వైపు నుంచి ఎస్ఈసీ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. మొదటగా.. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితో… ఎస్ఈసీ రమేష్‌కుమార్‌కు.. ప్రభుత్వం లేఖ రాయించింది. ఇది అసాధారణ ప్రయత్నం. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని రద్దు చేయాలని .. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని వివరించారు. పోలింగ్ రోజు జనం గూమిగూడకుండా నియంత్రించవచ్చని .. మరో 3,4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని సీఎస్ లేఖలో తెలిపారు.
స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని కోరారు. ఆ తర్వాత పార్టీకి చెందిన ఓ సానుభూతి పరుడితో..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. అత్యవసరంగా విచారణ జరపాలని.. స్థానిక సంస్థల ఎన్నికలను కొనసాగించాలని ఆదేశించారు. ఆ వెంటనే… సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు. ఇది మంగళవారం.. రెగ్యులర్ పిటిషన్లతో కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. వీటితోనే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు ఆపలేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పించడం ద్వారా… ఎస్ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీకి చెందిన నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.
అంతకు ముందు గవర్నర్ ను కలిసిన ఎస్ఈసీ రమేష్ కుమార్.. ఎన్నికల వాయిదా నిర్ణయానికి గల కారణాలు వివరించారు.ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ఉండటంతో… దాని కోసం ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ అయినా వేసేందుకు సిద్ధపడటం.. ఈ విషయంలో.. ఏదో ఓ అనూహ్య పరిణామానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.