వైసీపీ మరోసారి న్యాయవ్యవస్థపై దాడి ప్రారంభించింది. సుప్రీంకోర్టు చాలా కాలం క్రితం ఇచ్చిన యాభై శాతం రిజర్వేషన్ల తీర్పును ఇప్పుడు చూపిస్తూ.. వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థపై విరుచుకుపడ్డారు. న్యాయవ్యవస్థలు బీసీలు లేరని.. ఆరేడుగురు మాత్రమే ఉంటున్నారని అన్నారు. దుర్భుద్దితోనే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల తీర్పు ఇచ్చిందని.. వెంటనే దాన్ని ఎత్తి వేయాలన్నారు. న్యాయవ్యవస్థ ఘోరంగా ఉందన్నారు. తక్షణం రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎత్తివేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఎలాంటి రాజ్యాంగబద్దత లేదన్నారు. రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆ తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థలో బీసీలు లేనందునే ఆ అన్యాయం జరుగుతోందని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు.
కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ స్వతహాగా న్యాయవ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఇలాంటి వ్యాఖ్యలు కాదు అసలు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరు.ఇంత వరకూ ఆయన వైసీపీ విధాన నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశాన్ని వైసీపీ నేతలు ఇవ్వలేదు. ఎవరు ఏం మాట్లాడాలో వైసీపీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. స్క్రిప్ట్ అక్కడ్నుంచే వస్తుంది. ఆయన బీసీ కాబట్టి ఆయనను ముందు పెట్టి న్యాయవ్యవస్థపై దాడి చేయడానికి వైసీపీ హైకమాండ్ స్పష్టమైన వ్యూహం రూపొందించినట్లుగా తెలుస్తోంది.
గతంలో వైసీపీ హైకమండ్ న్యాయవ్యవస్థపై చేయని దాడి లేదు. సీజేఐ కావాల్సిన ఎన్వీ రమణపైనే తప్పుడుఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత అవి తేలిపోయాయి. ఈ నెలలోనే ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెలలోనే మళ్లీ న్యాయవ్యవస్థపై వైసీపీ వ్యూహాత్మకంగా దాడి చేస్తోందన్న అభిప్రాయానికి న్యాయవర్గాలు వస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ పై ఎన్నో అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన న్యాయవ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్‌ను అడ్డం పెట్టుకుని పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ.. విచారణనుఆలస్యం చేసుకుంటున్నారు. ఆ అవకాశంలోనే ఎన్నికల్లో పోటీ చేసి సీఎం అయ్యారు. ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థనే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.